Kaleshwaram Project: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి భావోద్వేగంతో మాట్లాడారు. కేంద్రంగా నిలిచిన అంశం కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వ ప్రాథమిక నివేదికను తిప్పి కొట్టుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు బలమైన రాజకీయ ఆరోపణలు చేశారు.
తెలంగాణ కోసం నిర్మించిన అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుపై కుట్రలు జరుగుతున్నాయన్నారు. ‘‘కాళేశ్వరంపై వండి వార్చిన నివేదికను అధికారికంగా బయట పెట్టడం కేవలం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రేరణతో కూడిన చర్యే’’ అంటూ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నివేదికలో ఉన్న తప్పులపై హరీష్ రావు ఒక్కో అంశాన్ని క్షుణ్ణంగా బహిర్గతం చేశారు. హరీష్ రావు ఘాటుగా ప్రశ్నించారు. ‘‘పోలవరం ప్రాజెక్టు మూడుసార్లు కుప్పలినా, అథారిటీ అయిన ఎన్డీఎస్ఏ అక్కడ ఎందుకు వెళ్లలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కసారి లోపం జరిగితే మాత్రం వెంటనే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయం?’’ అని నిలదీశారు. దేశంలో ఎన్నో కమిషన్లు వేసిన సందర్భాల్లో, అవి చట్టపరంగా నిలబడలేదని గుర్తుచేశారు. ‘‘ఒక నివేదిక వేశారంటే, అది ధర్మసంశోదన కాదు. ఆ నివేదిక వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు,’’ అన్నారు.
‘‘కాళేశ్వరం నిర్మాణం వెనుక లక్షల మంది రైతుల ఆశలు ఉన్నాయి. మా పాలనలో పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు జీవానికి ప్రాణంగా మారాయి. అలాంటి ప్రాజెక్టుపై పచ్చి అబద్దాలతో బురద జల్లడం బాధాకరం,’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. అవాస్తవాలు, అబద్దాలతో 60 పేజీల రిపోర్టు తెచ్చారని మండిపడ్డారు. ‘‘రేవంత్ రెడ్డి సీఎం అయిన నాటి నుంచి నేటివరకు ఒక్క నిజం మాట్లాడలేదు. అన్నీ అబద్దాలు, అర్ధసత్యాలు, నాటకాలు అని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారు. ఆరోపణలు చేయడమే ఏకైక పని అయింది,’’ అంటూ మండిపడ్డారు. ‘‘ఒక రాజకీయ నాయకుడిని, ముఖ్యంగా గత పదేళ్ల తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ని, ఇలా లక్ష్యంగా పెట్టుకోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను హింసించాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. లేకపోతే… కాంగ్రెస్ హయాంలో తమ్మడిహట్టిలో ఒక్క దమ్మెడు మట్టైనా వేసి ఉంటే, తెలంగాణ రైతన్నకి నీళ్లు అప్పుడే వచ్చేవి కదా!’’ అంటూ ప్రశ్నించారు హరీష్ రావు.