Malkajgiri Police: స్వేచ్ఛ బ్యూరో: గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేలా చూసేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు జరిగే ఉత్సవాల కోసం “గణేష్ సురక్ష సంకల్ప్–2026.. మన గణేష్–మన భద్రత” అనే నినాదంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు సీపీ సుమతి తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 వేలకుపైగా గణేష్ ప్రతిమలు ఏర్పాటవుతాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ఏర్పాట్ల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్‌ను వినియోగిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో మండపాల సమాచారం..
గణేష్ మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేయాలని పోలీసులు సూచించారు. ఇందుకోసం ‘తెలంగాణ పోలీస్ పోర్టల్’ (https://reference-url-citation.invalid/0) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో 6,500 ఆన్‌లైన్ దరఖాస్తులు అందినట్లు తెలిపారు. మండపాల వివరాలు ముందుగానే అందితే భద్రత, ట్రాఫిక్, అగ్నిమాపక, విద్యుత్, శబ్ద కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.
5,749 మంది పోలీసులతో భారీ బందోబస్తు..
గణేష్ ఉత్సవాల కోసం అన్ని స్థాయిలకు చెందిన 5,749 మందికి పైగా పోలీసు సిబ్బందిని బందోబస్తులో వినియోగించనున్నారు. వీరిలో 15 మంది డీసీపీలు,10 మంది అదనపు డీసీపీలు, 20 మంది ఏసీపీలు, 120 మంది సీఐలు, 350 మంది ఎస్‌ఐలు ఉండనున్నారు.
అదనంగా..
అదనంగా కరీంనగర్, భూపాలపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, ములుగు జిల్లాలతో పాటు రాష్ట్ర ప్రత్యేక విభాగాల నుంచి పోలీసు అధికారులు, సిబ్బందిని రప్పించారు. ఇందులో 6గురు ఎస్పీలు, 4గురు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 435 మంది ఎస్‌ఐలు ఉన్నారు. సున్నిత ప్రాంతాల్లో 4 టీజీఎస్పీ ప్లాటూన్లను కూడా మోహరించనున్నారు.
ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి..
ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జనాల సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా దాదాపు 12వందల మంది ట్రాఫిక్ సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు. ఉప్పల్ ఎక్స్ రోడ్, ఎల్‌బీనగర్ ఎక్స్ రోడ్, హబ్సిగూడ ఎక్స్ రోడ్, రాంపల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, ప్యారడైజ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, మారేడ్‌పల్లి, సీఎఫ్‌ఓ, రసూల్ పురా, వైఎంసీఏ, రోటరీ, తిరుమలగిరి తదితర ప్రాంతాలను కీలక ట్రాఫిక్ పాయింట్లుగా గుర్తించారు.
27 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు..
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కమిషనరేట్ పరిధిలో 27 నిమజ్జన ప్రాంతాలను గుర్తించారు. చెరువులు, బేబీ పాండ్లు, ప్రత్యేకంగా తవ్విన ట్యాంకులు, పోర్టబుల్ ట్యాంకుల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా షామీర్ పేట్ చెరువు, సరూర్ నగర్ చెరువు, రాంపల్లి చెరువు, ఉప్పల్ బేబీ పాండ్, ఈదులాబాద్ ట్యాంక్, సఫిల్ గూడ బేబీ పాండ్‌ల వద్ద ప్రత్యేక బందోబస్తు, సౌకర్యాలు కల్పిస్తున్నారు. 2025లో సుమారు 25 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా ఈ ఏడాది కూడా దాదాపు 25 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లోకి వచ్చే 9 వేల విగ్రహాలపై నిఘా..
ప్యాట్నీ, బేగంపేట్, వైఎంసీఏ ప్రాంతాల నుంచి సుమారు 9 వేల గణేష్ విగ్రహాలు హైదరాబాద్ సిటీ పరిధిలోకి ప్రవేశించే అవకాశం ఉందని పోలీసుల అంచనా. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి, హైదరాబాద్ పోలీసుల మధ్య సమన్వయం కోసం 24 గంటల పాటు పనిచేసే కమ్యూనికేషన్, కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
5వేల సీసీ కెమెరాలతో నిఘా..
ముఖ్యమైన ప్రాంతాల్లో సుమారు 5 వేల సీసీ కెమెరాలను వినియోగించనున్నారు. 10 అడుగులు, అంతకంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. అదనంగా ఏఐ ఆధారిత డ్రోన్ టెక్నాలజీతో నిఘా పెంచుతున్నారు. టీజీ క్వెస్ట్ ఆధునిక డ్రోన్ వ్యవస్థ ద్వారా శోభాయాత్రలు, భక్తుల రద్దీ, ట్రాఫిక్ రద్దీ, సున్నిత ప్రాంతాలు, అత్యవసర పరిస్థితులను గగనతలం నుంచి పర్యవేక్షించనున్నారు.
2,200 మంది సహచారి వాలంటీర్లు..
కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ‘మీ సురక్ష–సహచరి’కార్యక్రమాన్ని గణేష్ మండపాల వద్ద నిర్వహించనున్నారు. కమిషనరేట్ పరిధిలో 2,200 మంది సహచరి వాలంటీర్లు 552 గణేష్ మండపాల్లో పోలీసులతో కలిసి ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించనున్నారు.
వీఐపీ కార్యక్రమాలపై..
గణేష్ ఉత్సవ కమిటీలు తమ మండపాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. వీఐపీ, వీవీఐపీ పర్యటనలు, భారీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే మండపాల నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మండపాల లొకేషన్ మ్యాపింగ్ ద్వారా పోలీసులతో పాటు నిర్వాహకులు, ఇతర ప్రభుత్వ విభాగాలు అవసరమైన సౌకర్యాలను సమన్వయంతో కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
చెరువుల వద్ద..
నిమజ్జన ప్రాంతాల్లో తగినంత వెలుతురు, బారికేడ్లు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కాప్రాతో పాటు ఇతర ప్రాంతాల్లో శాశ్వత గణేష్ నిమజ్జన ప్రదేశాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రణాళికలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిమజ్జన విగ్రహాలను తరలించేందుకు రవాణా శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయంతో పాటు సరూర్ నగర్, బేగంపేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాల నుంచి అన్ని విభాగాలు, సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. గణేష్ ఉత్సవాలను భక్తి, క్రమశిక్షణ, బాధ్యత, సామరస్యంతో నిర్వహించాలని మల్కాజిగిరి సీపీ సుమతి ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేశారు. ‘మన గణేష్–మన భద్రత’ను ప్రతి ఒక్కరూ సమష్టి బాధ్యతగా భావించాలని సూచించారు.
Also Read: పోలీస్ పిల్లల చదువుపై నో టెన్షన్.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన నిర్ణయం!