Vakiti Srihari: స్వేచ్ఛ బ్యూరో: క్రీడలను విద్యతో అనుసంధానం చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలుతీసుకుంటుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శాసనమండలిలో శనివారం ఆయన మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి శాస్త్రీయ శిక్షణ, అత్యుత్తమ కోచింగ్ అందించడంతో పాటు స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పరిశోధన వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమన్నారు. విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు దేశీయ, అంతర్జాతీయ ప్రముఖ క్రీడా విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ తో సహకారానికి సంబంధించిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. క్రీడాకారులకు కేవలం మైదానంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆధునిక క్రీడా విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఆధారిత శిక్షణ అందించే విధంగా యూనివర్సిటీలో కోర్సులను రూపొందించనున్నట్లు తెలిపారు.
ప్రతి గ్రామంలో క్రీడా మైదానం..
ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు తెలంగాణ క్రీడాకారులను సిద్ధం చేసేందుకు హై ఫర్ఫామెన్స్ సెంటర్స్ తో పాటు ఆధునిక శిక్షణ విధానాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. క్రీడా ప్రతిభ పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న మైదానాల ఆధునీకరణ, క్రీడా పరికరాల సమకూర్పు, పాఠశాల స్థాయి నుంచే క్రీడా ప్రతిభను గుర్తించడం, మండల–జిల్లా స్థాయిలో ప్రతిభా అన్వేషణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.స్థానిక కోచ్‌లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు అథ్లెటిక్స్, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో తదితర క్రీడలకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.ప్రతి గ్రామంలో క్రీడా మైదానం – ప్రతి యువకుడిలో క్రీడా ప్రతిభను పెంచి తద్వారా తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం క్రీడా రంగాన్ని బలోపేతం చేస్తోందని స్పష్టం చేశారు.
క్రీడా బడ్జెట్ నాలుగు రెట్లు పెంపు..
వైఐపీఈఎస్ యూతో క్రీడలు–విద్య–ఉపాధి–పరిశోధనలను అనుసంధానం చేసి, తెలంగాణ యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మూడు బడ్జెట్లలోనే క్రీడారంగానికి 1,535 కోట్లు కేటాయించగా, బీఆర్ ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో కేటాయించిన మొత్తం కంటే ఈ ఒక్క ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ క్రీడా బడ్జెట్ ఎక్కువగా ఉందని తెలిపారు. గత కేటాయింపులతో పోలిస్తే క్రీడా బడ్జెట్ నాలుగు రెట్లు పెరిగిందన్నారు. గచ్చిబౌలిలో నూతన హాకీ స్టేడియం కోసం 2 టర్ఫులను ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో 700 కోట్లతో ఆధునీకరిస్తున్నామన్నారు. హనుమకొండలో కొత్త స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభమైందని తెలిపారు. డిసెంబర్ 11 నుండి 22 వరకు 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణ ను 272 కోట్ల అంచనా వ్యయం తో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోందని తెలిపారు. హాకీ ఇండియా లీగ్ ,వరల్డ్ పికిల్ బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్,టెన్నిస్ ప్రీమియర్ లీగ్లు ఈ ఏడాది తెలంగాణలో నిర్వహించనున్నామని స్పష్టం చేశారు.
Also Read: అధికారంలో ఉంటేనే సభకు వస్తారా? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు