Harisha Rao Met KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక సమావేశం కొనసాగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు ముఖ్య నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత ఎపిసోడ్‌పై చర్చ జరుగుతోంది. అదేవిధంగా తాజా రాజకీయ పరిణాలపై చర్చిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు లండన్ పర్యటన కూడా ముగిసింది. ఇవాళ ఉదయం హైదరాబాద్‌కు వచ్చారు. ఇప్పటికే హరీష్ రావు టార్గెట్‌గా కవిత తీవ్ర ఆరోపణలు చేయగా.. హరీష్ రావు ఆమెకు కౌంటర్ ఇచ్చారు..
కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ..
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొందరు ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ, కల్వకుంట్ల కవిత ఎపిసోడ్‌తో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
కవిత ఆరోపణలు, హరీష్ రావు కౌంటర్:
ఈ సమావేశానికి హాజరైన హరీష్ రావు లండన్ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై కవిత చేసిన ఆరోపణలను ఖండించారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని, అందులో ఎలాంటి దాపరికాలు లేవని స్పష్టం చేశారు. కవిత ఎందుకు ఆరోపణలు చేశారో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని, ప్రత్యర్థి పార్టీలు తనపై చేసిన ఆరోపణలనే కవిత కూడా చేసిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ ప్రజల కష్టాలను తొలగించడానికి తాము కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు.
ఫామ్‌హౌస్‌లో ఆరు రోజులు:
గత ఆరు రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉంటూ.. పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో పార్టీని ఎలా ముందుకు నడిపించాలనే దానిపై ఆయన సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం సీబీఐ విచారణ, కవిత వ్యవహారం పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారాయని, ఈ ప్రతికూలతను ఎలా అధిగమించాలన్న దానిపై ఈ సమావేశాల్లో కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారం బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు, సవాళ్లను స్పష్టంగా తెలియజేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్, కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావుల భేటీ పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉంది.