Check Posts: తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని రహదారులపై ఉన్న రవాణా చెక్‌పోస్టులను రద్దు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ తక్షణమే చర్యలు చేపట్టింది. సాయంత్రం 5 గంటలలోగా అన్ని చెక్‌పోస్టులను మూసివేయాలని.. ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు.
గతంలో వాహనాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే, క్రమక్రమంగా అవి అవినీతికి కేంద్రాలుగా మారాయి. కొంతమంది అధికారులు ప్రైవేట్ సిబ్బందిని ఉపయోగించి అక్రమ వసూళ్లు జరుపుతున్నారని విభాగానికి కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి.
ఇప్పటికే జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత.. చెక్‌పోస్టుల అవసరం చాలా మేరకు తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అనేక రాష్ట్రాలు ఇప్పటికే చెక్‌పోస్టులను రద్దు చేశాయి. తెలంగాణలో మాత్రం కొన్ని అధికారుల ఒత్తిళ్ల కారణంగా ఈ నిర్ణయం ఆలస్యమైంది. సుమారు ఏడాదిన్నర క్రితమే రవాణాశాఖ చెక్‌పోస్టుల రద్దుకు అనుమతి ఇచ్చినా, ఆ జీఓ అమల్లోకి రావడానికి ఇంతసమయం పట్టింది.
ఇటీవల మంత్రివర్గం సమీక్షా సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగగా, సీఎం రేవంత్ రెడ్డి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో రవాణాశాఖ కమిషనర్ వెంటనే ఆదేశాలు జారీ చేసి, సాయంత్రం 5 గంటల లోపే అన్ని చెక్‌పోస్టులను మూసివేయాలని సూచించారు.
చెక్‌పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బ్యారికేడ్లు తొలగించాలని, సిబ్బందిని ఇతర విభాగాల్లోకి బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే, చెక్‌పోస్టుల్లో ఉన్న పరికరాలు, ఫర్నిచర్, రికార్డులను సంబంధిత డీటీవో కార్యాలయాలకు తరలించాలని తెలిపారు.
Also Read: నా చావుకు కేటీఆర్, ఆ నేతలే కారణం.. బీఆర్ఎస్ మహిళా కార్యకర్త పోస్ట్ వైరల్
ప్రజలు, వ్యాపార వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. చెక్‌పోస్టుల రద్దుతో పారదర్శకత పెరిగి, అవినీతి తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రవాణా రంగం ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.