Bus Service: కరీంనగర్ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సర్వీస్ ప్రారంభమైంది. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బుధవారం రోజున.. జమ్మికుంట నుంచి బేతిగల్, కేశవపట్నం మీదుగా కరీంనగర్ వరకు నూతన బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ మార్గంలో బస్సు సౌకర్యం లేక సుదీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల ఆకాంక్ష ఈ రోజు సాకారమైంది. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు బాణాసంచా కాల్చి, పూలదండలతో ప్రణవ్‌కు ఘన స్వాగతం పలికారు.
బేతిగల్ గ్రామ ప్రజలు దశాబ్దాలుగా ఈ మార్గంలో బస్సు సౌకర్యం కోసం డిమాండ్ చేస్తూ వచ్చారు. తమ గ్రామం కూడా పక్క జిల్లాల లాగా అభివృద్ధి చెందాలంటే రవాణా సదుపాయం అత్యవసరం అని పదేపదే అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. చివరికి వారి ఆకాంక్ష నేడు ఫలించి, బస్సు సర్వీస్ ప్రారంభమవడంతో.. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. ఈ నూతన సర్వీసు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. బేతిగల్ ప్రజల నిరీక్షణ ఫలించిందని, ఈ సర్వీసు రోజుకు రెండుసార్లు నడుస్తుందని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం టికెట్ కొనుగోలు చేసి కొంత దూరం బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కొత్త సర్వీస్ అందరికీ ఉపయోగపడేలా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోందని గుర్తు చేశారు. ఈ సర్వీస్ ప్రారంభానికి సహకరించిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని ప్రణవ్ స్పష్టం చేశారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 63 మంది మృతి
తర్వాత వొడితల ప్రణవ్ వీణవంక మండలం పరిధిలోని బేతిగల్, వల్భాపూర్ గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బేతిగల్‌లో 4, వల్భాపూర్‌లో 3 చెక్కులు అందజేశారు. మొత్తం రూ. 3.15 లక్షల విలువైన చెక్కులను అందజేసి, లబ్ధిదారులు వెంటనే వాటిని బ్యాంకులో జమ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.