దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గణనాథులలో ఒకడు ఖైరతాబాద్ మహాగణపతి. భారీ విగ్రహం, భక్తుల ఉత్సాహం, అద్భుతమైన సంప్రదాయాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తొమ్మిది రోజుల పాటు ఘనమైన పూజలు అందుకునే ఈ గణనాథుడు హుస్సేన్ సాగర్ లో భక్తుల కోలాహలం నడుమ గంగమ్మ ఒడికి చేరుతాడు. ఇక ఈ గణేషుడికి సంబంధించి తయారీ నుంచి మొదలుకొని, నిమజ్జనం వరకు అన్నీ క్రతువులూ అద్భుతమే. ఇక్కడి లడ్డూ కూడా విగ్రహం మాదిరిగనే భారీ పరిమాణంలో ఉంటుంది. అంతేకాదు, ఇతర ప్రాంతాలలో గణపతి లడ్డూను వేలం వేసే సంప్రదాయం ఉన్నప్పటికీ, ఖైరతాబాద్‌లో ఆ పద్దతి లేదు. దానికి కారణం ఉందంటున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు.
ఖైరతాబాద్ మహా గణపతి చేతిలో ఉంచే లడ్డూ అత్యంత భారీ పరిమాణంలో తయారవుతుంది. సుమారు 5 నుంచి 6 టన్నుల బరువులో ఉంటుంది. ఈ లడ్డూ దాని పరిమాణానికి మాత్రమే కాదు, రుచికి చాలా ప్రసిద్ధి చెందింది. దీని తయారీ కోసం కేరళ లేదంటే ఆంధ్రా నుంచి ప్రత్యేక బృందాన్ని పిలిపిస్తారు. ఈ లడ్డూ తయారీలో శుభ్రమైన, నాణ్యమైన పదార్థాలను ఉపయోగిస్తారు. ప్రతి ఏటా విగ్రహం మాదిరిగానే లడ్డు బరువు కూడా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే, ఖైరతాబాద్ గణేషుడికి సమర్పించే లడ్డూ ప్రపంచంలోనే అతిపెద్ద లడ్డూల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గణపతి లడ్డూలను వేలం వేస్తారు. బాలాపూర్ గణపతి లడ్డూ ప్రతి ఏటా వేలంలో లక్షల రూపాయలు పలుకుతుంది. ఈసారి ఏకంగా రూ. 35 లక్షలు పలికింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో సుమారు రూ. 2 కోట్లకు పైగా ధర పలికి లడ్డూలు ఉన్నాయి. అయితే, ఖైరతాబాద్ మహా వినాయకుడి లడ్డూను మాత్రం వేలం వేయరు. ఈ నియమాన్ని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ దశాబ్దాలుగా పాటిస్తోంది. ఇక్కడ లడ్డూను ప్రసాదంగా భావిస్తారు కమిటీ సభ్యులు. దానిని వ్యాపార వస్తువుగా భావించరు. లడ్డూను అందరికీ పంచిపెట్టడం ద్వారా దాని పవిత్రతను కాపాడాలని భావిస్తారు. లడ్డూ కోసం వేలంపాట పెట్టడం వల్ల భక్తుల మనోభావాలను దెబ్బ తీసినట్లు అవుతుందంటారు. ఇక్కడి లడ్డూను భక్తులకు ప్రసాదంగా అందించాలనేదే తమ కోరిక అంటారు.
ఇక ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో కేవలం ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలైన ఈ ఉత్సవాలు, ప్రతి సంవత్సరం విగ్రహం ఎత్తును పెంచుతూ వచ్చారు. 2025లో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి పేరుతో 69 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు బదులుగా పూర్తి మట్టితో తయారు చేశారు. ఇకపై కూడా ఖైరతాబాద్ గణపతిని మట్టితోనే తయారు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Read Also: ఆ దేశ ప్రజలు ఒంటె మూత్రం తాగుతారట.. కారణం తెలిస్తే మీరూ కావాలంటరేమో!