Harishrao Comments: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని, ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని ఆయన అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరిగాయన్నారు. డెంగ్యూ కేసులపై ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా సమీక్ష చేయలేదంటూ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో లేవన్నారు. ప్రజారోగ్యం కంటే ఏదైనా ముఖ్యమైనది ఉన్నదా? అంటూ ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా రాష్ట్రంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందన్నారు. దోమల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం లేకపోలేదన్నారు. ప్రభుత్వం డెంగ్యూపై సమీక్ష చేయకుండా.. విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: హక్కులకోసం పోరాడాలి.. కులగణనపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
డైవర్షన్ రాజకీయాలకు రేవంత్ ప్రభుత్వం తెరలేపిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తున్నదని ఆయన ఆరోపించారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు. నోటీసులు ఇచ్చిన తరువాత తప్పుంటే కూలగొట్టాలన్నారు. రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా కక్ష సాధించడం మంచిదికాదంటూ హరీశ్ రావు అన్నారు. రుణమాఫీ విషయంలో మంత్రులు రోజుకొక మాట మాట్లాడుతున్నారన్నారు. సాంకేతిక కారణాల పేరుతో మంత్రులు కాలయాపన చేస్తున్నారంటూ హరీశ్ రావు విమర్శించారు. ప్లానింగ్ లేక కుంటిసాకులు చెబుతున్నారన్నారు. అదేవిధంగా అప్పుల విషయంలో కూడా ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. అలవికాని హామీలిచ్చి గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు.