HCU వివాదంలో ఏఐ వీడియోలు, ఫేక్ పోస్ట్ లు పెట్టి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎంత హడావిడి చేశారో అందరం చూస్తూనే ఉన్నాం. ఆ వీడియోలతో జనాన్ని మోసం చేయడమే కాకుండా, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించారు నేతలు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్న వారందరిపై కేసులు పెడతామని హెచ్చరించింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. HCU విషయంలో ఫేక్ వీడియోలు పెట్టినందుకు కేటీఆర్ సహా మిగతా నేతలందరికీ నోటీసులిచ్చారు. ఆ నోటీసులందుకున్నవారిలో బీఆర్ఎస్ నేత క్రిశాంక్, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తనపై కేసు కొట్టేయాలంటూ ఆయన కోర్టుని అభ్యర్థించారు.
కోర్టులో చుక్కెదురు..
క్రిశాంక్ క్వాష్ పిటిషన్ విషయంలో ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఆయనకు ప్రతికూలంగా కోర్టు నిర్ణయం వెలువడింది. ఆయన విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. క్రిశాంక్ పోలీసులకు సహకరించాలని ఆదేశించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు నకిలీ వీడియోలను వైరల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్ కావడంతో చాలామంది నేతలు తమ ట్వీట్లను డిలీట్ చేశారు కూడా. క్రిశాంక్ కూడా ఇలాగే ట్వీట్లు పెట్టారు. అయితే పోలీసులు చెబుతున్నట్టుగా తానెలాంటి ఫేక్ వీడియోలు ప్రమోట్ చేయలేదని ఆయన కోర్టుకి తెలిపారు. తనపై 4 తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. తనపై పెట్టిన కేసులు కొట్టివేయాలని క్రిశాంక్ పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే క్రిశాంక్ ప్రచారంపై పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. కంచ గచ్చిబౌలి భూములపై ఏఐ సహాయంతో ఫేక్ వీడియోలు తయారు చేసి, వాటిని ప్రచారం చేశారని, సీఎంపై అనుచిత పోస్టులు పెట్టారని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. న్యాయస్థానం ఈ వాదనలతో ఏకీభవించింది. క్రిశాంక్ విచారణకు రావాల్సిందేని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూ వివాదంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. 400 ఎకరాలు ప్రభుత్వ భూమి కాదని వారు తప్పుడు ప్రచారం చేశారు. అదే సమయంలో భూమిని చదును చేసే క్రమంలో అటవీ ప్రాణులకు నష్టం వాటిల్లుతోందని కూడా కొన్ని వీడియోలు బయటపెట్టారు. ఫొటోలు, వీడియోలతో అక్కడ ఏదో జరిగిపోతోందనే భ్రమను కల్పించారు. కానీ చివరకు అవన్నీ ఏఐతో తయారు చేసిన ఫేక్ వీడియోలు అని తేలింది. వాటిని నిజం అని నమ్మించేందుకు ప్రతిపక్ష నేతలు, ఆయా పార్టీలు అభిమానులు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ జనం నమ్మలేదు. చివరకు అవి ఫేక్ వీడియోలు కావడంతో వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తప్పుడు ప్రచారం చేసిన ప్రతిపక్ష నేతలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రచారం జరిగింది వాస్తవమే అయినా కొంతమంది ఆ వీడియోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేస్తున్నారు. తామెక్కడా తప్పు చేయనట్టు కవర్ చేస్తున్నారు. అప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించారు. వారి అధికారిక ఖాతాలనుంచి వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడాన్ని రికార్డ్ చేశారు. పక్కా ఆధారాలతో పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టడంతో తప్పుడు ప్రచారం చేసిన నేతలు దొరికిపోయారు.