 
					బీఆర్ఎస్ కి దూరం జరిగినంత తొందరగా కవిత, తన తండ్రి కేసీఆర్ కి దూరం జరగలేకపోయారు. కొన్నాళ్లు జాగృతి ప్రచారంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతోపాటు కేసీఆర్ ఫొటో కూడా కనిపించేది. అయితే ఇకపై అది సాధ్యం కాకపోవచ్చు. జాగృతి పూర్తి స్థాయిలో జయశంకర్ ని ఓన్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ వదిలిపెట్టి, కేసీఆర్ వ్యక్తిపూజకు దిగితే, జయశంకర్ పేరుతో జనంలోకి వెళ్లాలనుకుంటున్నారు జాగృతి కవిత.
కరీంనగర్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి ఘన స్వాగతం పలికిన జాగృతి శ్రేణులు.. బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు, డప్పువాయిద్యాలతో స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు
అనంతరం భారీ ర్యాలీ గా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు
ఆ తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త… pic.twitter.com/A2FQ4wRurY
— Telangana Jagruthi (@TJagruthi) October 31, 2025
జయశంకర్ నామ స్మరణ..
తెలంగాణ రాష్ట్ర సాధన రాష్ట్ర ప్రజల, నాయకుల ఉమ్మడి కృషికి లభించిన ఫలితం. అది ఏ ఒక్కరి వల్ల సాధ్యమైందని చెప్పలేం, ఏ ఒక్కరికో క్రెడిట్ ఇవ్వాలంటే కుదరదు. రాష్ట్ర సాధనలో ఎంతోమంది త్యాగాలు చేశారు. అలాంటి వారిలో ఒకరు ప్రొఫెసర్ జయశంకర్. జయశంకర్ ని చాలామంది తెలంగాణ వాదులు, ఉద్యమకారులు గౌరవిస్తారు. ఆయన మరణం అనంతరం రాష్ట్ర ఏర్పాటు వరకు జయశంకర్ నామ స్మరణ చేసిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక ఆయన పేరుని పూర్తిగా పక్కన పెట్టారనే వాదన ఉంది. ఇప్పుడు జయశంకర్ పేరుతో కవిత రాజకీయం చేయాలని చూస్తున్నారు.
ఉద్యమ నాయకులపై సానుభూతి
ప్రత్యేక తెలంగాణే ప్రధాన అజెండాగా పనిచేశారు జయశంకర్, కానీ తెలంగాణ కల సాకారం కాకమునుపే ఆయన కన్నుమూశారు. ఆయనతో పోల్చి చూస్తే ఫక్తు రాజకీయ నాయకుడు కేసీఆర్. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారమే పరమావధిగా ఆయన రాజకీయం చేశారనే విమర్శలున్నాయి. తెలంగాణ ఉద్యమకారుల్లో చాలామందికి రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ రాజకీయాలు నచ్చలేదు. అలాంటి వారు కొందరు బీఆర్ఎస్ లోనే సైలెంట్ గా ఉన్నారు. వారందర్నీ తనవైపు తిప్పుకోడానికి కవిత ఎత్తుగడలు వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యమకారులకు న్యాయం జరగలేదని అంటున్న ఆమె, జయశంకర్ పేరుతో రాజకీయం మొదలు పెట్టారు.
కరీంనగర్ పర్యటన
తాజాగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్న కవిత కరీంనగర్ లో వెళ్లారు. అక్కడ భారీ ర్యాలీ చేపట్టి అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అడుగడుగునా జయశంకర్ పేరుని స్మరిస్తున్నారు కవిత. క్రమక్రమంగా ఆమె కేసీఆర్ కి దూరమయ్యేలా కనపడుతున్నారు. కేసీఆర్ పార్టీతోనే కొట్లాడాలి అనుకున్నప్పుడు కచ్చితంగా ఆమె కేసీఆర్ కి దూరం జరగాలి, అవసరమైతే ఆయనపైనే విమర్శలు చేయాలి. కేసీఆర్ పై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టకపోవచ్చు కానీ, ఇప్పటికైతే ఆయన విధానాలను తప్పుబడుతున్నారు కవిత. తన గాడ్ ఫాదర్ గా జయశంకర్ ఫొటోతో ఆమె రాజకీయాలు మొదలు పెడుతున్నారు.
కవితవైపు ఎవరు?
తనను అన్యాయంగా బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారనే సానుభూతి కోసం కవిత ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. పార్టీలోనుంచి బయటకు వచ్చే సమయంలో కూడా ఆమె బీఆర్ఎస్ లోని కీలక నేతలపై విమర్శలు చేశారు. ఇప్పుడిక కొత్త పార్టీ నిర్మాణంపై దృష్టిపెడుతున్నారు. బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకోవడం కలే అనుకున్నా, బీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీసే విధంగా ఆమె తన పార్టీని బలపరిచే అవకాశం ఉంది. అదే జరిగితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మరింత గడ్డుకాలం ఎదురుకాక తప్పదు.
Also Read: కర్నూలు బస్సు ప్రమాదంలో మూడో వాహనం ప్రమేయం..