Phone Tapping case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ నేటితో ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితో గత వారం రోజులుగా ప్రత్యేక విచారణ బృందం (SIT) ఆయనను సుదీర్ఘంగా విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో.. సేకరించిన కీలక సమాచారాన్ని నివేదిక రూపంలో సీట్ అధికారులు సిద్ధం చేశారు.
విచారణకు సహకరించిన ప్రభాకర్ రావు
గత ఏడు రోజులుగా జరిగిన విచారణలో ప్రభాకర్ రావు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? డేటా ధ్వంసం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అనే కోణంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణ ప్రక్రియను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ ముగిసిన అనంతరం సీట్ బృందంతో సమీక్ష నిర్వహించిన సీపీ, కేసు పురోగతిపై చర్చించారు. ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను నివేదికలో పొందుపరిచారు.
రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఈ కేసు రేపు (శుక్రవారం) సుప్రీంకోర్టు ముందుకు రానుంది. వారం రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు వెల్లడించిన వివరాలు, సేకరించిన ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సీట్ బృందం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనుంది. ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ముందుకు వెళ్లే వ్యూహం
ప్రభాకర్ రావుకు గతంలో ఉన్న ముందస్తు ఉపశమనాన్ని రద్దు చేయాలని పోలీసులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఆయన విచారణకు సహకరిస్తున్నప్పటికీ, కేసు తీవ్రత దృష్ట్యా కస్టడీ కొనసాగింపు లేదా అరెస్ట్ వంటి చర్యలకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరే అవకాశం ఉంది. రేపు సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రాతిపదికన సీట్ బృందం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ తీర్పుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.