Heavy Rain: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, వికారాబాద్‌జిల్లా తాండూర్‌లో, మణుగూరు, హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయటకు రాలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.
మణుగూరులో బాలికల పాఠశాల దుస్థితి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బుధవారం తెల్లవారుజామున మొదలైన వర్షం.. నాలుగు గంటలపాటు కుండపోతగా కురిసింది. ఈ వర్షం ప్రభావంతో స్థానిక గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలోకి.. భారీగా వర్షపు నీరు చేరింది. వసతి గృహం నిండిపోయిన వరదనీటితో.. విద్యార్థినులు భయబ్రాంతులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన అధికారులు వెంటనే స్పందించి.. బాలికలను హుటాహుటిన సమీపంలోని.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తరలించారు. ఈ సమయంలో విద్యార్థినులు తడిసి ముద్దయ్యారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.
హైదరాబాద్‌లో రాత్రి అతలాకుతలం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా మలక్‌పేట్, అబిడ్స్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. GHMC సిబ్బంది అత్యవసర చర్యలతో.. కొన్ని ప్రాంతాల్లో నీటిని తరలించేందుకు ప్రయత్నించారు.
జిల్లాల వారీగా వర్ష హెచ్చరికలు
వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదే సమయంలో, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇండియన్ మెటీరొలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) వెల్లడించింది.
Also Read: అమ్మను కొట్టాడని పదేళ్లు వెతికి మరీ హత్య
ప్రభుత్వ సూచనలు – అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, విద్యా సంస్థలు, హాస్టళ్ల యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికార యంత్రాంగం సూచిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని, ట్రావెలింగ్ చేయకుండా ఇంటి వద్దే ఉండాలని.. అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇలా ఎవ్వరూ కూడా.. ముంపు ప్రాంతాల్లోకి వెళ్ళకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.
భారీ వర్షం.. బాలికల వసతి గృహంలోకి చేరిన వరద నీరు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సుమారు నాలుగు గంటల పాటు భారీ వర్షం
గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలోకి భారీగా చేరిన వర్షపు నీరు
బాలికలను హుటా హుటిన ప్రభుత్వ కళాశాలకు తరలింపు pic.twitter.com/RnKSXftrOH
— BIG TV Breaking News (@bigtvtelugu) July 23, 2025