Rain Update: తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు రుతుపవన ద్రోణి అనూప్ ఘర్, చురు, గ్వాలియర్, రేవా నుంచి ఉత్తర చత్తీస్గడ్, జార్ఖండ్ వాయుగుండం కేంద్రం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగి బలహీనపడింది. తెలంగాణలో మొత్తం 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది.
ఇవాళ పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అత్యధికంగా కామారెడ్డిలో 6.93 సెం.మీ వర్షపాతం
నిన్న కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా కామారెడ్డిలో 6.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. GHMC పరిధిలో 1.9 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై రాకపోకలు తీవ్ర ఇబ్బందిగా మారాయి. మున్నేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జ్ వర్షాలకు కనిపించడం లేదు. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు రహదారిని ముంచేసింది. 12 గ్రామాలకు అనుసంధానంగా ఉంది ఈ ప్రధాన రహదారి. అత్యవసర సమయంలో కూడా ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది స్థానికులు వాపోతున్నారు.
Also Read: కొండాపూర్‌లో రేవ్ పార్టీ కలకలం.. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్
అల్పపీడనం తీరం దాటినా.. కురవని భారీ వర్షాలు
ఒక వైపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నా… విశాఖలో మాత్రం వర్షం జాడ కనిపించడంలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటిన… భారీ వర్షాలు మాత్రం కురవట్లేదు. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఒక్క అల్లూరి సీతారామరాజులో మాత్రమే వర్షపాతం నమోదైంది. మిగిలిన ఏ జిల్లాల్లో కూడా వర్షాల జాడ కనిపించలేదు. నిన్నటి నుంచి ఎండలు మళ్లీ మొదలయ్యాయి. వర్షాకాలం సీజనే ముగుస్తున్నప్పటికీ వర్షాలు రాకపోవంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.