Weather News: గడిచిన నెలలో దాదాపు పది రోజుల పాటు భాగ్యనగరంలో వర్షం దంచికొట్టిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు నగర వాసులు అల్లాడిపోయారు. భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం చిత్తడిచిత్తడై పోయింది. రోడ్లపైకి భారీ వరద నీరు చేరుతుండడంతో భాగ్యనగర వాసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఓవైపు భారీ వర్షాలు, మరో వైపు ట్రాఫిక్ సమస్యలతో వాహనదారుల అష్టకష్టాలు చూశారు. అయితే గత ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు పడడం లేదు. అయితే ఆగస్టు నెలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తాజాగా ఆగస్టు నెలలో వాతావరణ పరిస్థితులపై అధికారులు అంచనా వేశారు.
ఈ ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం….
ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో వర్షం దంచికొట్టనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో పట్ట పగలే చిమ్మచీకటిగా మారిపోయింది. ఇప్పటికే భాగ్యనగరంలో మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉప్పల్, పంజాగుట్ట, గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. రోడ్ల పైకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. షేక్‌పేట్‌లో అత్యధికంగా 7.4 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఆసిఫ్‌నగర్‌లో 5.3, ఖైరతాబాద్‌లో 5 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరో గంట సేపట్లో ఈ ప్రాంతాల్లో భారీవర్షం..
మరో గంట సేపట్లో ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, చాంద్రయాన్ గుట్ట, కాప్రా, మల్కాజిగిరి, తార్నాక, ఓయూ, అల్వాల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. ఉరుములు, పిడుగుల పడే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే హైడ్రా, జీహెచ్‌ఎంసీ భాగ్యనగర వాసులను అప్రమత్తం చేసింది.
ఆగస్టు నెలలో ఇది వాతావరణ పరిస్థితి…
ఆగస్టు 4 నుంచి ఆగస్ట్ 6: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు.. హైదరాబాద్ లో భారీ వర్షాలు
ఆగస్ట్ 7 నుంచి ఆగస్ట్ 15: దక్షణ, పశ్చిమ, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్..
ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 23: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం..
ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 1: మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు
నోట్: జులై నెలలో కంటే ఆగస్ట్ నెలలో ఎక్కువగా వర్షాలు పడే ఛాన్స ఉందని అధికారులు చెబుతున్నారు..