భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో మిగ్‌జాం తుపాన్ ధాటికి వర్షాలు దంచికొడుతున్నాయి. గత 24 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు నానావస్థలు పడుతున్నారు. వర్షపు నీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీలు నిండి రహదారులపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. అకాలవర్షం ధాటికి వేల ఎకరాలలో పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వరి, శనగ, పొగాకు, మొక్కజొన్న పంట నీట మునగటంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నిన్న అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని అయిదు మండలాలో దాదాపు 100 మిల్లీమీటర్ల కు పైగా వర్షపాతం నమోదయ్యింది. రాత్రి నుంచి వరద ప్రభావం మరింత పెరిగింది. దాంతో గ్రామీణ ప్రాంతలలో ఉండే చెరువులు, కాలువలు నిండు కుండలుగా మారాయి.
దమ్మపేట మండల కేంద్రంలోని పేరంటాల చెరువు కాలువకు గండి ఎర్పడగా పైనుంచి వస్తున్న వరద ధాటికి సుమారు 100 ఎకరాల వరి పంట నిటమునిగింది. వర్షం నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరటంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దమ్మపేట మండల పరిధిలోని నెమిలిపేట నీట మునిగింది. అశ్వారావుపేట మండలంలోని గిరిజన గ్రామాల్లోనికి వెళ్లే కల్వర్టులపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో గూడెలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు దమ్మపేటలోనీ గాయత్రి నగర్ ప్రాంతాన్ని వరద నీరు చుట్టుముట్టింది.