Rain Aler: హైదరాబాద్‌లో ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, అమీర్‌పేట, ప్రగతినగర్, బాచుపల్లి, మూసాపేట, ఎస్‌ఆర్ నగర్, మధురానగర్, బోరబండ, పంజాగుట్ట, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరితో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ వాన కురిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా నగరంతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి టైంలో హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగర వాసులు ఉపశమనం పొందుతున్నారు.
మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం పడింది. దీంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి మురుగు నీరు రోడ్లపై ప్రవహించాయి. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అకాల వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని పేర్కొంది.మరోవైపు జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు అందిస్తోంది.
కాగా తెలంగాణలో వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని శాంతి కుమారిని ఆదేశించారు. తర్వాత సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న 48 గంటల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్న..హెచ్చరికలు ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎస్.
ఉక్కపోత నుంచి రిలీఫ్ కలిగినా.. అకాల వర్షాలు అపార నష్టాన్నే మిగిల్చాయి. గాలివానకు కరెంట్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. వడగండ్ల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో పొట్ట దశలోని ధాన్యపు గింజలు, మామిడి పూత, కాయలు రాలిపోయాయి. మొక్కజొన్న పంట నేలవాలింది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సాలురు మండలంలో 50 ఎకరాల్లో మొక్కజొన్న పడిపోయింది. మార్కెట్ లలోకి రైతులు తీసుకువచ్చిన పసుపు పూర్తిగా తడిచిపోయింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్ లో ఆరబోసిన మక్కలు కొట్టుకుపోగా.. మక్కల బస్తాల తడిచిపోయాయి.
⦿ మెదక్ జిల్లాలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మెదక్ టౌన్‌లో ఓ ఇంటిపై పిడుగు పడినట్టు చెప్తున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పొద్దుటి నుండి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు మొక్కజొన్న పొలాలు నేలకొరిగాయి. కోత కొచ్చిన పంట పాడవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానదారులు సైతం వర్షంతో ఇబ్బంది పడ్డారు.
⦿ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో భారీ వర్షం కురిసింది. వేడి గాలులతో పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు మామిడికాయలు రాలుతాయని, చేతికందిన పంట ఆగమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
⦿ కోనాపూర్‌లో నివాస గృహాల మధ్యలో ఉన్న తాటిచెట్టుపై పిడుగు పడింది. మంటలు చెలరేగడంతో ఏ వైపునకు పడుతుందోనని ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా తాటి చెట్టుపైన మంటలు చల్లారడంతో జనమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
⦿ రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడలో వర్షం కురిసింది. వర్షం కారణంగా రాజన్న సన్నిధికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. అలాగే చందుర్తి, రుద్రంగి, కొనరావుపేట మండలాల్లో కూడా పలు చోట్ల వాన పడింది. మార్చి తొలి రోజుల నుంచే భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లాలో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. అయితే.. ఇప్పుడు వర్షం పడటంతో ప్రజలకు ఉపసమనం కలిగింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఉదయం నుంచే జిల్లాలో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
Also Read: అద్దె వాహనానికి రూ.61 లక్షలు వసూల్-స్మితా సభర్వాల్‌కు యూనివర్శిటీ నోటీసులు
⦿ కొమురం భీం ఆసిఫాబాద్‌లో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. రెబ్బెన మండలంలో ఈదురు గాలులు, వడగండ్లుతో ఇంటి పైకప్పు, రేకుల షెడ్లు ఎగిరిపడ్డాయి. ఒక్కసారి మారిన వాతావరణం, గాలివానతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
⦿ పెద్దపల్లి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. పలు గ్రామాలలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నిట్టూరు గ్రామంలో రాళ్లతో వర్షం కురిసింది.
⦿ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో భారీ ఉరుములు, మెరుపులు భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో వరణుడు బీభత్సం సృష్టించాడు. ఉదయం నుండి చాలా ఎండగా ఉండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. మామిడి పంట పూతకు వచ్చిన సమయంలో వర్షం కరవడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.