Teenmar Mallanna to High court : మొయినాబాద్ ఫాంహౌజ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వీడియోలను సీఎం కేసీఆర్.. దేశంలోని ప్రముఖులందరికీ పంపడంతో తీవ్ర కలకలం రేపుతోంది. బాగా ఇరుక్కుపోయిన బీజేపీ.. ఆ మధ్యవర్తులతో తమకేమీ సంబంధం లేదంటూ గట్టిగా వాదిస్తోంది. తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వరుస ప్రెస్ మీట్లతో కేసీఆర్ పై రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో హైకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి.
ఈ కేసులో సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే, ప్రభుత్వ కౌంటర్ పిటిషన్ సుదీర్ఘంగా ఉన్నందున వాదనలకు సమయం కావాలని ప్రేమేందర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. మరోవైపు, నిందితుల కస్టడీ పిటిషన్ కు ప్రభుత్వ తరఫు న్యాయవాది అనుమతి కోరగా ధర్మాసనం నిరాకరించింది. ఫాంహౌజ్ కేసు దర్యాప్తుపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించగా.. అది సోమవారం వరకు కొనసాగనుందది.
హైకోర్టులో మరో ఇద్దరు సైతం పిటిషన్లు వేశారు. ఈ కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని కోరుతూ.. తీన్మార్ మల్లన్న సైతం కోర్టులో పిటిషన్ వేయడం ఆసక్తికర పరిణామం. ఇక ముగ్గురు నిందితుల్లో ఒకరైన నందు కుమార్ భార్య చిత్రలేఖ గురువారమే హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ దర్యాప్తుపై విశ్వాసం లేదని.. సీబీఐ లేదా ప్రత్యేక సిట్ తో సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జరపాలని.. ఫాంహౌజ్ వీడియో, ఆడియోలను విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరారు నందు భార్య.
ఇలా బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, నందు భార్య చిత్రలేఖలు దాఖలు చేసిన వేరువేరు పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది హైకోర్టు.