Crop Varieties: స్వేచ్ఛ బ్యూరో: రైతులకు లాభదాయక వ్యవసాయ అనుకూలంగా వంగడాలను కనుగొనాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కోరారు. దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా సంఘ సమావేశం నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జరిగింది. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణాధికారులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ రైతుల సమస్యలకు సమయానుకూల పరిష్కారాలు కనుగొనాలని జిల్లా సూచించారు.
ఆధునిక సాంకేతికత వినియోగంతో వ్యవసాయంలో మానవ శ్రమను తగ్గించుకోవడంతో పాటు, ఆరోగ్యానికి హాని కలిగించని పద్ధతులను అవలంబించాలని, పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన విధానాలను అనుసరించాలని కోరారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని తట్టుకునే పంటలు, సాంకేతికతలను అభివృద్ధి ఉందన్నారు. శాస్త్రవేత్తలు అందించే సలహాలు సూచనలను పాటిస్తూ తమ పంట పొలాల దిగుబడిని పెంచే విధంగా శాస్త్రీయ బద్దంగా పంటల సాగుకు అనువైన పరిస్థితులను కల్పించుకోవాలని రైతులను కోరారు.
పరిశోధన కేంద్రం సంచాలకులు డా. ఎల్. కృష్ణ మాట్లాడుతూ.. దక్షిణ తెలంగాణ ప్రాంతం వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. గత సంవత్సరంలో వరి, వేరుశనగ, సెనగ వంటి పంటల్లో సాధించిన పురోగతిని వివరించారు. ముఖ్యంగా వరి పంటలో అభివృద్ధి చేసిన RNR 25105, 31479 వంటి అధిక దిగుబడి, తక్కువ నూకశాతం కలిగిన వంగడాల గురించి వివరించారు. విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వరి, అముదం పరిశోధన కేంద్రాలను అభినందించారు.
చలి, ఎండలను తట్టుకునే పంట రకాల అభివృద్ధి, వరి ప్రత్యామ్నాయ పంటల విస్తరణ, వేరుశనగ మరియు ఇతర పంటల విస్తీర్ణాన్ని పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో 200కి పైగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ సంచాలకులు, 12 జిల్లాల వ్యవసాయ అధికారులు, విస్తరణ శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాఖ అధికారులు, NABARD మరియు భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ ప్రణాళిక రూపకల్పనకు విలువైన సూచనలు, సలహాలు అందించారు.
Also read: ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం