రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. నేటితో ప్రచారపర్వానికి తెర పడనుంది.సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. అనంతరం ఒక రోజు తర్వాత ఎల్లుండి అనగా 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు స్వతంత్రులు, మూడు పార్టీలకు చెందిన రెబల్స్ సైతం తామేంటో అధిష్టానాలకు చూపించాలని బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే, పోలింగ్ తర్వాత ఏ పార్టీ ఏ స్థానానికి పరిమితం కానుందో త్వరలోనే తేలనుంది. అయినప్పటికీ పార్టీలు అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో తమ పొజిషన్ ఏంటో ఇప్పటికే వారికి అర్థం అయినట్టు తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలవబోతున్నారని సమాచారం అందుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే అంతర్గతంగా ఓ సర్వేను చేపట్టింది. ప్రజల్లో పార్టీ మీద ఎటువంటి ఓపీనియన్ ఉందో తెలుసుకున్నది. సర్పంచ్ ఎన్నికల అనంతరం అంతే పాటిజివ్ ఒపీనియన్ ప్రజల్లో ఉందని తెలుసుకున్నాకే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు జై కొట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం అయ్యారు. అందులో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని.. కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని వారికి సూచించారు. తన వద్ద సర్వే నివేదిక ఉందని వారికి భరోసా కల్పించారు. ఈ ప్రకారం కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లో 100కు పైగా మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు గెలుస్తామని ధీమాగా చెబుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతుందని తెలుస్తోంది. రూరల్ ఏరియాల్లో కారు పార్టీకి మంచి పట్టు ఉండగా.. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం బీజేపీకి మంచి పట్టు ఉన్నది. ఈ మధ్యకాలంలో బీజేపీకి పల్లెల్లోనూ మద్దతు పెరుగుతోంది. ఆ మధ్య బీజేపీ ఎంపీలతో సమావేశమైన మోడీ వారికి క్లాస్ పీకిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నా ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదని.. ప్రజల్లోకి ఎందుకు వెళ్లడం లేదని మోడీ క్లాస్ అనంతం.. రాష్ట్ర బీజేపీ నేతల్లో మార్పు వచ్చినట్టు సమాచారం. దీనికి తోడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు.
Phone tapping : ఎఫ్ఎస్ఎల్ విషాదం.. ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు భద్రమేనా?
ఎంపీలు సైతం క్షేత్రస్థాయిలో గట్టిగానే ప్రచారం మొదలెట్టారు. ఇక బీఆర్ఎస్ నేతలు మాత్రం బీజేపీ కంటే ఆలస్యంగా ప్రచారం ప్రారంభించారు. ఎందుకంటే ఆ పార్టీ పెద్దలు మొన్నటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేటీఆర్, హరీశ్ రావు, జిల్లా ఇన్ చార్జులు ఓట్ల కోసం వార్డులు, డివిజన్లలో పర్యటిస్తున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్దఎత్తున ప్రచారం చేస్తుండటంతో ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం తగ్గినట్టు చర్చ జరుగుతున్నది. అయితే, సర్పంచ్ ఎన్నికల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్.. ఈసారి అదే స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందా? అని అనుమానాలు కలుగుతున్నాయి. ఒక వేళ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపొతే రాబోయే రోజుల్లో ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.