Big Stories

Secunderabad : సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్పోర్ట్స్‌ షోరూమ్ లో మంటలు

Secunderabad : సికింద్రాబాద్‌ పరిధి నల్లగుట్టలోని ఓ షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్‌ షోరూంలో ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. ఆరు అంతస్తుల భవనంలో కింద కార్ల విడి భాగాల గోదాంలో షార్ట్ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగాయి. ఆ మంటలు పైఅంతస్తులో ఉన్న షోరూంకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీపంలోని దుస్తుల దుకాణంలోనూ పొగలు కమ్మేశాయి. ప్రమాదంలో చిక్కుకున్న నలుగురిని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.

- Advertisement -

అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ సందర్శించారు. సహాయ చర్యలను పర్యవేక్షించారు. అగ్నిప్రమాద ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. భవనంపైన చిక్కుకున్న నలుగురిని సిబ్బంది సురక్షితంగా కాపాడారన్నారు. అయితే దుకాణం లోపల ఇద్దరు చిక్కుకుని ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. చుట్ట పక్కల ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి తెలిపారు. ఇళ్ల మధ్య గోదాంలు, పరిశ్రమలు ఉండటం దురదృష్టకరమన్నారు. వీటి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చర్యలు చేపడితే 25 వేల దుకాణాలు ఖాళీ చేయించాల్సి ఉంటుందన్నారు. అనుమతులు లేని దుకాణాలు, గోదాంలపై కఠిన చర్యలు తీసుకుంటామని తలసాని హెచ్చరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News