Kamareddy News: అంతర్గత కలహాల వల్ల భార్యాభర్తలు ఒకరికి తెలీకుండా మరొకరు చంపేసుకుంటున్న రోజులివి. భార్యకు సీమంతం చేసి పుట్టింటికి పంపాడు భర్త. అయితే రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించింది. ఆమె లేని లోకంలో ఉండలేని భావించిన ఆ భర్త, యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
అసలేం జరిగింది?
కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన 30 ఏళ్ల సునీల్ ఏడాది కిందట వివాహం జరిగింది. మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్ గ్రామానికి చెందిన27 ఏళ్ల జ్యోతితో ఏడాది కిందట పెళ్లి జరిగింది. ఆమె గర్భిణి కావడంతో మే 14న బిచ్కుందలో సీమంతం నిర్వహించారు ఇరు కుటుంబాలు. ఇరుగు పొరుగువారు భార్యని అందరూ దీవించారు. పండంటి బిడ్డకు జన్మ ఇవ్వాలని ఆశీర్వాదం ఇచ్చారు.
సీమంతం తర్వాత జ్యోతిని పుట్టింట్లో వదిలిపెట్టాడు భర్త సునీల్. శుక్రవారం తిరిగి తన గ్రామానికి తీసుకొచ్చేందుకు సునీల్ వెళ్లారు. భార్యభర్తలు ఇద్దరు టూ వీలర్స్‌పై వస్తుండగా, బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి సమీపంలో వాహనం నుంచి జ్యోతి కిందపడింది. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అంబులెన్సులో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మార్గం మధ్యలో జ్యోతి మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బిచ్కుందకు తీసుకొచ్చారు. ఇంటి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విగత జీవిగా మారిన భార్యను చూసి తట్టుకోలేకపోయాడు సునీల్. చివరకు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. భార్య చనిపోయి వారంపైగా అవుతున్నా ఆ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోయాడు.
ALSO READ: మిస్ వరల్డ్ నుంచి నిష్క్రమించిన మిస్ ఇంగ్లాండ్, తనని అలా చేశారంటూ ఆరోపణలు
భార్య లేని లోకంలో తాను ఉండకూడదని డిసైడ్ అయ్యాడు సునీల్. బాత్‌రూంలోకి వెళ్లి యాసిడ్ తాగాడు. బయటకు వచ్చి వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. జ్యోతి-సునీల్ వారం రోజుల వ్యవధిలో ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.