Huzurabad Municipal Election: హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ (Vodithala Pranav) నేతృత్వంలో పార్టీ శ్రేణులు ప్రచార పర్వంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్నాయి. పట్టణంలోని 3, 4 మరియు 18వ వార్డుల్లో నిర్వహించిన ముమ్మర ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ప్రతీ గడపకూ చేరుతూ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వొడితల ప్రణవ్ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గత పదేళ్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల పట్టణం ఎదుర్కొన్న సమస్యలను ఎండగడుతూనే, గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆయన ప్రజల కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా ప్రణవ్ మాట్లాడుతూ ప్రజల అవసరాలే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. “గత పదేళ్లలో జరగని పనులు కేవలం రెండేళ్లలోనే చేసి చూపాం. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రుణమాఫీ, భరోసా, బోనస్, ఇతర సంక్షేమ కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని ప్రజలకు వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులను అభివృద్ధి చేసుకునేందుకు మరింత అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వంలో పని చేసే అధికారులను అధికారికంగా కలవాలంటే అధికార పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సూచించారు. ప్రజలు మెరుగైన పాలన కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్తున్న తరుణంలో మహిళలు, వృద్ధులు ప్రణవ్‌కు బ్రహ్మరథం పడుతూ, ఈసారి ఎన్నికల్లో హస్తం గుర్తుకే తమ ఓటు అని స్పష్టమైన మద్దతు తెలుపుతున్నారు. ప్రజల ఆశీస్సులు ఉంటే మరింత బాధ్యతాయుతంగా పనిచేసి హుజూరాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
Also Read:Mahabubabad Municipal: ఆ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పీఠం నువ్వా నేనా? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైట్!