Canal Bridges: హుజురాబాద్ పట్టణ పరిధిలోని ఎస్సారెస్పీ (SRSP) కెనాల్ వంతెనలు వాహనదారులకు, బాటసారులకు మృత్యుకుహరాలుగా మారాయి. ఒకవైపు సైదాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న కెనాల్ వంతెన, మరోవైపు ఇప్పలనర్సింగాపూర్ వద్ద ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ వంతెనలకు ఇరువైపులా రక్షణ గోడలు (రెయిలింగ్స్) పూర్తిగా ధ్వంసమై ఏళ్లు గడుస్తున్నా కనీసం మరమ్మతులు చేసే దిక్కు లేకుండా పోయింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఈ వంతెనలు దాటాల్సిన దుస్థితి నెలకొంది.
సైదాపూర్, హుస్నాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో సైదాపూర్ రోడ్డులో, అలాగే ఇప్పలనర్సింగాపూర్ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు, పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారి ఆర్ అండ్ బి (R&B) శాఖ పరిధిలోకి వస్తుండగా, వంతెనల పరిసరాలు హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. అయితే, “మా పరిధి కాదంటే మా పరిధి కాదు” అన్నట్లుగా రెండు శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రెండు వంతెనలకూ ఇరువైపులా కనీస రక్షణ లేకపోవడం, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల వెలుతురుకు దారి తెలియక వాహనదారులు నేరుగా కాలువలో పడిపోయే పెను ప్రమాదం పొంచి ఉంది.
ప్రస్తుతం సైదాపూర్ రోడ్డులోని వంతెనకు ఆనుకునే నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఒకవైపు ఆలయ దీపాల వెలుతురులో పండుగ వాతావరణం నెలకొంటే, అడుగు దూరంలోనే రెయిలింగ్ లేని వంతెన చీకట్లో నోరు తెరుచుకుని ప్రమాదానికి ఆహ్వానం పలుకుతోంది.
భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న ఈ సమయంలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయి శవాలు తేలిన తర్వాతే అధికారులు మొద్దునిద్ర వీడుతారా అని పట్టణ ప్రజలు నిలదీస్తున్నారు. ఆర్ అండ్ బి, మున్సిపల్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సైదాపూర్ రోడ్డు, ఇప్పలనర్సింగాపూర్ వంతెనలకు యుద్ధప్రాతిపదికన ఇరువైపులా పటిష్టమైన రెయిలింగ్ ఏర్పాటు చేయాలని, ప్రమాద హెచ్చరిక సూచికలు పెట్టాలని ప్రజలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Also read: ఒంటరి అమ్మాయి చేతిలో విలన్ల గ్యాంగ్ చిత్తు.. ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్