Miyapur Fire Accident: హైదరాబాద్‌లోని మియాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న ఓ పెయింట్ దుకాణంలో మంటల వ్యాపించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకుని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదానికి అసలు కారణమిదే..
దుకాణం ముందు భాగంలో కొత్తగా సైన్ బోర్డు ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. అందులోంచి ఎగిసిన నిప్పురవ్వలు ప్రమాదవశాత్తు లోపల ఉన్న రసాయనాలు, పెయింట్ డబ్బాలపై పడ్డాయి. మండే స్వభావం ఉన్న రసాయనాలు కావడంతో క్షణాల్లోనే మంటలు భారీగా చెలరేగి దుకాణమంతటా వ్యాపించాయి.
రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటం, నల్లటి పొగలు ఆకాశాన్ని తాకడంతో చుట్టుపక్కల వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్.. ఏపీ రూట్ ఓకే.. మరి బ్రేక్ ఎక్కడ పడింది?