Huzurabad: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్ నియోజకవర్గం ఇకపై కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాప సాయి గార్డెన్‌లో బీఎల్ఏలకు (బూత్ లెవల్ ఏజెంట్లు) ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. వొడితల ప్రణవ్ అధ్యక్షతన జరిగిన ఈ ముఖ్య సమావేశానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం, సుడా (SUDA) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలపై ప్రణవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో హుజూరాబాద్‌కు ఎందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని ప్రణవ్ ప్రశ్నించారు. “ఉప ఎన్నికల సమయంలో స్వయంగా హరీష్ రావు ఇచ్చిన ప్రొసీడింగ్స్ నిధులు సైతం వెనక్కి మళ్లాయి. పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనివారు.. ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ధి చేస్తామంటూ ప్రజలను మభ్యపెట్టడం హాస్యాస్పదం. కౌశిక్ రెడ్డి మాయలో పడి హరీష్ రావు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతులు, అంతా గమనిస్తున్నారు” అని ఆయన హితవు పలికారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ప్రణవ్ నిప్పులు చెరిగారు. “ప్రభుత్వం అధికారంలో ఉండి, తాను ఎమ్మెల్సీగా, విప్‌గా ఉన్నప్పుడే కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి తట్టెడు మట్టి కూడా తీయలేదు, ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదు. ఇప్పుడు పిచ్చిలేచినట్టు ప్రవర్తిస్తున్నాడే తప్ప అభివృద్ధిపై మాట్లాడటం లేదు. కౌశిక్ రెడ్డికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి రావాలి.. అప్పుడు ఎవరి సత్తా ఏంటో ప్రజల ముందే తేల్చుకుందాం” అని సవాల్ విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసమే దళిత సోదరులను వాడుకున్నారని, గత ప్రభుత్వం రెండేళ్లు అధికారంలో ఉన్నా ఎందుకు పూర్తిస్థాయిలో దళితబంధు నిధులు ఇవ్వలేదని నిలదీశారు.
Also Read: TGSRTC Merger: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విలీనం తర్వాతే వేతన సవరణపై నిర్ణయం!
బీఆర్ఎస్ నాయకులు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని నాయకులు మండిపడ్డారు. జమ్మికుంట మార్కెట్‌లో సుమారు లక్ష క్వింటాళ్లకు పైగా మక్కలను, వడ్లను కాంగ్రెస్ ప్రభుత్వమే చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. “బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నీళ్లు మాయం, నిధులు మాయం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రైతు సంక్షేమం, ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నాం. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాదిలోనే పూర్తి చేసి చూపించింది. రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత కూడా కాంగ్రెస్‌దే” అని వివరించారు.
ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన ముఖ్య నేతలు శ్రీశైలం, నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ.. ఓటరు నమోదు జాబితా సవరణ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల చేరికపై నిఘా ఉంచాలన్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరడం, సర్పంచుల స్థానాల్లో, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండటమే ఇందుకు నిదర్శనమని.. ఇకపై ఇక్కడ ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ విజయకేతనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తున్నారని, కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విస్తృత స్థాయి సమావేశంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, వైస్ చైర్‌పర్సన్ అంజలి, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, దేవాలయ కమిటీ చైర్మన్లు, మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మహిళా విభాగం అధ్యక్షురాళ్లు, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మైనారిటీ, సేవాదళ్, బ్లాక్ కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నేతలు, సోషల్ మీడియా ఇంచార్జీలు మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Also read: PHC Negligence: చల్లూర్ పీహెచ్‌సీలో రోగుల ప్రాణాలతో చెలగాటం!