Employee Fraud: నమ్మకంగా పనిచేస్తున్న ఉద్యోగులే ఒక్కోసారి సంస్థ నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారు. హైదరాబాద్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తాను పనిచేస్తున్న కంపెనీకే కన్నం వేసింది. ఏకంగా రూ.4.19 కోట్లు కాజేసిన ఓ మహిళా ఉద్యోగి .
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్‌లోని నార్సింగిలో ఉన్న ‘ట్రాక్‌ట్రిక్స్ ఆప్టో డైనమిక్స్’ అనే సంస్థలో ఉమ అనే మహిళ అడ్మిన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఆఫీసులో ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలు చూసుకునే ఆమె.. తనకున్న అధికారాన్ని అడ్డంపెట్టుకుని పెద్ద స్కెచ్ వేసింది. కంపెనీ తరపున కొనుగోలుదారులకు చెల్లించాల్సిన చెక్కులను పక్కదారి పట్టించడం మొదలుపెట్టింది. ఆ చెక్కులన్నింటినీ నేరుగా తన భర్త బ్యాంక్ ఖాతాలోకి మళ్లిస్తూ గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు కొట్టేసింది.
ఏడాదిన్నర పాటు సాగిన మాయాజాలం
ఈ వ్యవహారం ఒక్కరోజులో జరిగింది కాదు. గతేడాది ఏప్రిల్‌లో మొదలైన ఈ తంతు, ఈ ఏడాది జులై వరకు సాగింది. దాదాపు ఏడాదిన్నర పాటు కంపెనీ యాజమాన్యానికి ఎలాంటి అనుమానం రాకుండా ఉమ చాలా తెలివిగా వ్యవహరించింది. ఇలా విడతలవారీగా ఆమె తన భర్త ఖాతాలోకి మళ్లించిన మొత్తం అక్షరాలా రూ.4.19 కోట్లు అని తేలింది.
ఆడిట్ దెబ్బకు బట్టబయలు
ఎంత తెలివిగా దోచేసినా ఏదో ఒకరోజు దొరకక తప్పదు కదా! ఇటీవల కంపెనీలో నిర్వహించిన వార్షిక ఆడిట్‌లో లెక్కలు తేడా రావడంతో యాజమాన్యం అప్రమత్తమైంది. లోతుగా పరిశీలించగా అసలు బండారం బయటపడింది. దీంతో కంపెనీ ప్రతినిధులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసును సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ, నలుగురు మృతి