BRS Party Surveys: గులాబీ దళంలో మళ్లీ రాజకీయ కదలికలు మొదలయ్యాయి. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ప్రజల్లో పార్టీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది? ఏయే గ్రామాలు, మండలాల్లో పార్టీ బలంగా ఉంది? ఎక్కడ బలహీనంగా ఉంది? ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది? ఇలాంటి అంశాలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. పార్టీ అధినేత నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు తమ తమ పరిధిలో రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం కొందరు నేతలు పార్టీ అధికారిక యంత్రాంగంపై ఆధారపడకుండా సొంతంగా సర్వేలు నిర్వహించుకుంటుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాబోయే రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని బేరీజు వేసుకునే ప్రయత్నం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఎదురైన పరిస్థితులు, ఆ తర్వాత జరిగిన రాజకీయ మార్పులు, స్థానికంగా నాయకుల పనితీరు, కార్యకర్తల క్రియాశీలత, ప్రజలతో నాయకులకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీకి అనుకూలంగా ఉన్న అంశాలేమిటి? ప్రతికూలంగా మారిన పరిస్థితులేమిటి? ప్రజల్లో ఇంకా పట్టు సాధించాల్సిన ప్రాంతాలేవి? అనే వివరాలను సేకరిణలో నిమగ్నమయ్యారు. కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు, నియోజకవర్గంలో పట్టు, పార్టీ బలాబలాలను అంచనా వేసుకునేందుకు వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సర్వేల ద్వారా అందే సమాచారాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని భావిస్తున్నారు.
పార్టీకి పట్టు తగ్గిన గ్రామాలు, మండలాలను గుర్తించడం ఈ సర్వేల ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. ఒకప్పుడు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? స్థానికంగా పార్టీ నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందా? కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారా? ఇతర పార్టీల ప్రభావం పెరిగిందా? వంటి అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా రాజకీయ పరిస్థితిని విశ్లేషిస్తూ, పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించే దిశగా నేతలు ఆలోచిస్తున్నారు. ఎక్కడ నాయకత్వ సమస్య ఉంది? ఎక్కడ కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడింది? ఎక్కడ ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి? అనే వివరాలను తెలుసుకుంటున్నారు. సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది.
ప్రజల నాడిని తెలుసుకోకుండా రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆశించిన ఫలితాలు రావనే అభిప్రాయంతో గులాబీ నేతలు ముందుగా ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజల స్పందన, స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై అభిప్రాయాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో ఉన్న ఆలోచనలను తెలుసుకుంటున్నారు. పార్టీ నేతలతో ఆరా తీస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై సర్వే చేయించుకుంటున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఎక్కువగా ఉన్న అంశాలేవి? ఏ సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు? ఏ ప్రాంతాల్లో ప్రభుత్వానికి మద్దతు ఉంది? ఎక్కడ వ్యతిరేకత కనిపిస్తోంది? అనే అంశాల ఆధారంగా తమ రాజకీయ కార్యాచరణను రూపొందించుకోవాలని భావిస్తున్నారు. ప్రజల మూడ్ తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడంతోపాటు, ప్రతికూల పరిస్థితులున్న చోట్ల ముందుగా ప్రజలతో మమేకం కావాలని యోచిస్తున్నారు.
ప్రస్తుత ప్రభుత్వ పాలనలోని లోపాలు, ఎన్నికల హామీల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సర్వేల ద్వారా తెలుసుకుని, ఆయా అంశాలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువత, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలనేది పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఏ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించాలి? ఏ సమస్యకు ప్రజల్లో ఎక్కువ స్పందన వస్తోంది? ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రచారం చేపట్టాలి? అనే అంశాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.
సర్వేల ద్వారా సేకరిస్తున్న సమాచారం కేవలం ముఖ్య నేతలకే పరిమితం కాకుండా నియోజకవర్గాల్లోని ద్వితీయశ్రేణి నాయకత్వానికి కూడా చేరవేయాలనే ప్రయత్నం జరుగుతోంది. మండల, గ్రామ స్థాయిలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలకు స్థానిక పరిస్థితులను వివరిస్తూ, ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలపై సూచనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కడ పార్టీ బలహీనంగా ఉందో అక్కడ నాయకులు, కార్యకర్తలు మరింత సమయం కేటాయించడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, స్థానికంగా పార్టీని బలోపేతం చేయడం వంటి బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ముఖ్య నేతలు అందించే సమాచారంతో క్షేత్రస్థాయి నాయకులు తమ పరిధిలోని రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని భావిస్తున్నారు.
Also Read: Gundeninda GudiGantalu Today episode: శృతికి ప్రభావతి వార్నింగ్..పాపం మనోజ్.. బాలు మాటతో మీనా షాక్..
గులాబీ శిబిరంలో జరుగుతున్న ఈ సర్వేల వెనుక పార్టీని క్షేత్రస్థాయిలో తిరిగి బలోపేతం చేయాలనే లక్ష్యం కనిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా బలాబలాలను గుర్తించడం, బలహీన ప్రాంతాలపై దృష్టి పెట్టడం, ప్రజల సమస్యలను రాజకీయ అస్త్రాలుగా మలచుకోవడం, నాయకులు-కార్యకర్తలను సమన్వయం చేయడం వంటి అంశాలపై కసరత్తు సాగుతోంది.
Also Read: గార్జీయస్ లుక్ లో మలయాళ బ్యూటి.. చూపులతోనే పిచ్చెక్కిస్తుంది మావా..