Ghost SIM: స్వేచ్ఛ బ్యూరో: సైబర్ క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ సైబర్ క్రైం విభాగం తాజాగా వారిపైకి ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ అస్త్రాన్ని ప్రయోగించింది. సైబర్ కేటుగాళ్లకు సప్లయ్ అవుతున్న ఘోస్ట్ సిమ్ నెట్ వర్క్ ను ఛిన్నాభిన్నం చేసింది. 13 రాష్ట్రాల్లో వారం రోజులపాటు దాడులు జరిపిన 18బృందాలు బృందాలు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ నేరగాళ్లపై పోలీసుల ప్రత్యేక దాడులు
సైబర్ నేరాలపై యుద్ధాన్ని ప్రకటించిన సైబర్ క్రైం విభాగం ఆపరేషన్ ఆక్టోపస్ 1.0 జరిపి సైబర్ క్రిమినల్స్ కు మ్యూల్ అకౌంట్లు సమకూరుస్తున్న వారి భరతం పట్టారు. ఆక్టోపస్ 2.0 ఆపరేషన్ లో మ్యూల్ అకౌంట్లు తెరవటానికి సహకరించిన బ్యాంకు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. తాజాగా జరిపిన ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 ఆపరేషన్ లో భాగంగా ఘోస్ట్ సిమ్ వ్యవస్థను చావుదెబ్బ కొట్టారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్, సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం స్పెషల్ ఆపరేషన్ లో భాగంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఏడు రోజులపాటు దాడులు జరిపాయి.
544 సిమ్ కార్డులు స్వాధీనం
66మంది నిందితులను అరెస్ట్ చేసి 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో 432 సీల్డ్ సిమ్ లు ఉండగా.. 112 ఓపెన్డ్ సిమ్ లు ఉన్నాయి. అరెస్ట్ అయిన వారిలో 44మంది ఘోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20మంది సిమ్ కార్డుల పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు, టెలీకాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ కార్డుల సప్లయర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో వీళ్లు భాగస్వాములుగా ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ నేరాల్లో సైబర్ క్రిమినల్స్ 101.87 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టుగా నిర్ధారణ అయ్యింది.
నిందితుల విచారణలో కీలక అంశాలు
నిందితులను జరిపిన విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. ఎవరైనా కొత్త సిమ్ కార్డు తీసుకోవటానికి…మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినపుడు నిందితులు వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నట్టుగా వెల్లడైంది. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే సమయంలో నెట్ వర్క్ సరిగ్గా లేదు..సర్వర్ డౌన్ అయ్యింది..వేలిముద్ర సరిగ్గా పడలేదని నమ్మించి రెండు మూడు బయో మెట్రిక్ లను తీసుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్టుగా తేలింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి మరీ నిరక్షరాస్యులు, నిరుపేదల నుంచి వారి ఆధార్, బయోమెట్రిక్ లను తీసుకుని వారి పేర్ల మీద సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఎన్ని సిమ్ కార్డులు అమ్మితే అంత కమీషన్ తోపాటు సైబర్ క్రిమినల్స్ నుంచి భారీ మొత్తాల్లో డబ్బు వస్తుండటంతో ఏజెంట్లు ఇలా మోసాలు చేసినట్టుగా తేలింది.
ఇండియన్ నంబర్లతో సైబర్ మోసాలు
ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను క్రిమినల్స్ భౌతికంగా విదేశాలకు పంపించకుండా ఈ సిమ్ కార్డులుగా మారుస్తున్నారు. అనంతరం వాటి వివరాలను విదేశాల్లో ఉంటున్న సైబర్ క్రైం గ్యాంగులకు చేరవేస్తున్నారు. ఈ ముఠాలు భౌతిక సిమ్ కార్డు లేకుండానే మన దేశపు మొబైల్ నెంబర్లను వాడుతూ విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు. ఇండియన్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తున్నారు.
అధికారులకు సజ్జనార్ ప్రశంసలు
ఆ తరువాత జనాన్ని ఉచ్ఛులోకి లాగి లక్షలు..కోట్లు కొల్లగొడుతున్నారు. న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ‘సెక్స్‌టార్షన్’ ముఠాలు..సీబీఐ తదితర దర్యాప్తు సంస్థల అధికారులమంటూ భయపెట్టే ‘డిజిటల్ అరెస్ట్’ గ్యాంగులు సైతం ఈ నెంబర్లనే వాడుతుండటం గమనార్హం. దేశవ్యాప్తంగా ఘోస్ట్ సిమ్ వ్యవస్థను దెబ్బకొట్టిన డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతిలను కమిషనర్ సజ్జనార్ అభినందించారు. తాజాగా వెలుగు చూసిన వివరాల నేపథ్యంలో త్వరలోనే ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్-ఐడియా తదితర టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించినట్టు చెప్పారు.
కేంద్ర సంస్థలతో సమావేశాలు
దాంతోపాటు డీవోటీ, ట్రాయ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కోరనున్నట్టు వివరించారు. మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు యాక్టీవ్ గా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వ పోర్టల్ సంచార్ సాథీని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
Also Read: మద్యం ప్రియులకు షాక్.. త్వరలో పెరగనున్న ధరలు.. సిఫార్సు చేసిన కమిటీ!