Hyderabad Formula E Race Case: హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? రేపో మాపో మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్‌కుమార్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వనుందా? అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో పైరవీలు సాగుతున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తోంది.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఐఏఎస్ అధికారి దాన కిషోర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. దాదాపు ఏడు గంటల పాటు ఆ రికార్డ్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసు మొదలు నిధులు విదేశీ కంపెనీ ఇచ్చిన వరకు జరిగిన ప్రతీ విషయాన్ని పూసగుచ్చి అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఫైల్స్ దగ్గర పెట్టి అడిగిన ప్రతీదానికి సమాధానం చెప్పారాయన. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా మిగతా ఇద్దర్ని విచారించేందుకు రెడీ అవుతోందట ఏసీబీ. మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్‌లను రేపో మాపో నోటీసులు ఇవ్వనుంది. ఆ తర్వాత విచారించాలని భావిస్తోంది. వీరితోపాటు మరికొందరి అధికారులు ఈ జాబితాలో ఉన్నట్లు ఉద్యోగుల వర్గాల నుంచి ఓ వార్త హంగామా చేస్తోంది.
ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. కేబినెట్ అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధులు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆయా నిధులను బదిలీ చేసినట్టు గుర్తించింది. ఆ తర్వాత ఒప్పందాలు జరిగినట్టు కనిపిస్తోంది.
ALSO READ: తెలంగాణలో అటవీ విస్తీర్ణం తగ్గిందా..? కారణాలు ఇవే!
ఇప్పటికే సీఎంకి ఓ నివేదికను ఇచ్చిందట ఏసీబీ. ఆ తర్వాత సీఎస్‌కు అందజేసినట్టు సమాచారం. అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు అరవింద్ కుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాల ద్వారా కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడినట్టు అందులోని సారాంశం. తనను కాపాడాలని కోరినట్టు చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అరవింద్ అప్రూవర్‌గా మారే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేసు విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చి అందుకు సంబంధించిన వారిని విచారించడం సహజం. కేటీఆర్ ముందస్తు బెయల్ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని న్యాయస్థానానికి ఏసీబీ తెలిపే అవకాశముంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఇక్కడ కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతోందో చూడాలి.