Haryana CM Ambedkar| రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొన్ని రోజుల క్రితం పార్లమెంటు అవమానకరంగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. గత కొన్ని రోజులుగా చాలా రాష్ట్రాల్లో బిజేపీకి వ్యతిరేకంగా అమిత్ షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనలు చేస్తున్నాయి. అమిత్ షా ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హర్యాణా ముఖ్యమంత్రి, బిజేపీ పార్టీ నాయకుడు నాయబ్ సింగ్ సైనీ కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ పేరుతో దేశంలో చాలా పెద్ద నాటకం ఆడుతోందని, ఇదే కాంగ్రెస్ జవహర్ లాల్ నెహ్రూ సమయంలో అంబేడ్కర్ ని వ్యతిరేకించిందని.. ఆయనను అవమానించిందని చెప్పారు.
హర్యాణా చండీగడ్ లోని పిడబ్యూడి రెస్ట్ హౌస్ లో మంగళవారం ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. “కాంగ్రెస్ చరిత్రలో అంబేడ్కర్ ను ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంది. ఆయన దేశం కోసం శ్రమిస్తే.. దానికి గుర్తింపు నివ్వలేదు. ఆయన పోరాటాన్ని అపహాస్యం చేసింది. కేంద్ర కేబినెట్ నుంచి అంబేడ్కర్ రాజీనామా చేస్తే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆయనను పార్లమెంటులో మాట్లాడడానికి కూడా అనుమతినివ్వలేదు. కాంగ్రెస్ ఎప్పుడూ ఎస్సీ, ఎస్టీలకు భద్రతనివ్వలేదు. కేవలం ముస్లింల గురించే కాంగ్రెస్ ఆలోచిస్తుంది. అంబేడ్కర్ రాజీనామా చేసతే.. ఆయన రాజీనామా పత్రాన్ని బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ పెద్దలు ఇష్టపడలేదు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు అమిత్ షా ప్రసంగంలోని ఓ భాగాన్ని తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తోంది.” అని నాయబ్ సింగ్ సైనీ చెప్పారు.
అంబేడ్కర్ కు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు క్షమాపణలు చెప్పాలని, అంబేడ్కర్ రాజీనామా పత్రాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదో సమాధానం చెప్పాల్సిందేనని హర్యాణా ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. “అమిత్ షా ప్రసంగాన్ని రాజకీయం చేశారు. అనవసరంమైన వివాదం సృష్టించి హై డ్రామా చేస్తున్నారు. దేశ ప్రజలు సత్యాన్ని త్వరలోనే తెలుసుకుంటారు. అంబేడ్కర్‌ని చరిత్రలో ఎలా అగౌరవపరిచిందో మొత్తం రికార్డుని త్వరలోనే భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు తీసుకువస్తుంది.” అని సిఎం సైనీ తెలిపారు.
Also Read: ఎన్నికల నిబంధనల్లో ఈసీ మార్పులు.. ఇకపై పారదర్శకత ఉండదు.. మండిపడిన ఖర్గే
డిసెంబర్ 17, 2024న భారతదేశ రాజ్యంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన అంబేడ్కర్ గురించి కొన్ని వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. “అంబేడ్కర్, అంబేడ్కర్, అంబేడ్కర్.. ఆయన పేరు పదే పదే చెప్పడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఆయన పేరుకు బదులు ఆ భగవంతుడి పేరు అన్ని సార్లు పలికి ఉంటే ఏడు జన్మల పాటు స్వర్గం లభించేదేమో.” అని అమిత్ షా ప్రతిపక్ష పార్టీలనుద్దేశించి అన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పార్లమెంటులో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందేనని నిరసనలు చేస్తూ పట్టుబట్టాయి. పార్లమెంటు ప్రాంగణంలో అంబేడ్కర్ చిత్ర పటాలను పట్టుకొని అమిత్ షాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు నినాదాలు చేశారు.
ఈ వివాదంపై అమిత్ షా స్పందిస్తూ.. కాంగ్రెస్ తన మాటలను వక్రీకరించిందని చెప్పారు. అంబేడ్కర్ లెగసీపై బిజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయాలు జోరందుకున్నాయి. ఇక రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తనున్నారు.