Hyderabad Football Match: ఈనెల 13న ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సితో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతాపరమైన, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి గురువారం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చెందిన అధికారులతో పాటు మ్యాచ్ నిర్వాహకులు కూడా ఈ సమావేశంలో హాజరై, తమ శాఖల ద్వారా జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీకి వివరించారు.
ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ… మ్యాచ్‌కు తరలివచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, వారికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, ఫుట్‌బాల్ ప్రొఫెషనల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సికి ఉన్న ప్రపంచవ్యాప్త ఇమేజ్ దృష్ట్యా, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నందున భద్రతాపరమైన ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రేక్షకులకు సంబంధించిన మార్గదర్శకాలను, భద్రతా నియమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇందుకోసం మెట్రో రైళ్లలోనూ, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసే ప్రచార బోర్డుల ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్ మళ్లింపు వివరాలను తెలియజేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా, అధికారులు ఉప్పల్ స్టేడియం భద్రతాపరమైన అనుకూలతలను డీజీపీకి వివరించారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, సెక్యూరిటీ పరంగా చాలా అనువైనదని వారు తెలిపారు. స్టేడియాన్ని సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అనే నాలుగు ప్రధాన సెక్టర్లుగా విభజించామని, దాదాపు 39 వేల మంది కూర్చునే సామర్థ్యం ఈ ప్రాంగణానికి ఉందని వివరించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాచ్‌ను ఎటువంటి లోపాలు లేకుండా, విజయవంతంగా నిర్వహించాలని డీజీపీ సూచించారు.
Also Read: CM Revanth Reddy: ఎల్లుండి మెస్సీతో ఫుట్‌బాల్ సమరం.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి