Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. అలాంటి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. 2017లో ప్రారంభమైన ఈ మెట్రో ప్రాజెక్ట్ నగరంలోని లక్షలాది మంది ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రజా రవాణా సాధనంగా మారింది. మెట్రో వచ్చిన నుంచి నగరంలో కొంత ట్రాఫిక్ కూడా తగ్గుమొఖం పట్టింది. ప్రతి రోజు మెట్రోను సుమారు 4.5 లక్షల మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే.. భారీ రుణాలు, నిర్వహణ ఖర్చులు ఈ ప్రాజెక్టును కష్టాల్లోకి నెట్టేశాయని తెలుస్తోంది. దీని నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్&టి) కంపెనీ చేపట్టింది. కానీ టికెట్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చులకు సరిపోకపోవడంతో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ కు సమస్యలు మొదలయ్యాయి.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను వదిలించుకోవడానికి తాము రెడీగా ఉన్నట్లు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ తేల్చి చెప్పేసింది. భాగ్య నగరంలోని మూడు కారిడార్ లలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (PPP) పద్ధతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టును సెంట్రల్ గవర్నమెంట్ లేదా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా ఓకే అని చెప్పేసింది. ఆర్థికంగా భారంగా పరిణమించిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్వహణ తమ వల్ల కావట్లేదంటూ చేతులెత్తేసింది.
2020 నాటికి.. రాష్ట్ర ప్రభుత్వం ఎల్&టికి రూ. 5,000 కోట్లు చెల్లించాలి. అంతేకాకుండా.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మరో రూ. 254 కోట్లు కూడా ఇవ్వాలి. ఈ భారీ రుణాలు ఎల్&టిని ఇబ్బంది పెడుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇక మెట్రో నిర్వహణను కొనసాగించలేమని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తెలిపింది. తన ఈక్విటీని విక్రయించడానికి సిద్ధమని, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్ కింద లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటు ద్వారా నియంత్రణను బదిలీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు వివరించింది.
ALSO READ: KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా అంటూ..?
ఎల్&టి కేంద్ర నగరాభివృద్ధి మంత్రికి కూడా లేఖ పంపింది. ఆర్థిక భారాన్ని మోయలేమని సహాయం కోరింది. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఛార్జీల పెంపు, నిర్వహణ సవాళ్లు, మొదటి దశ పూర్తికాని పనులపై వివరణాత్మక నివేదిక అడిగింది. హైదరాబాద్ మెట్రో భారతదేశంలో పీపీపీ మోడల్ కింద నిర్మించబడిన మొదటి మెట్రోగా ప్రత్యేకత సాధించింది. ఇటీవల ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఆర్‌బీఐ 4.61 ఎకరాల భూమిని రూ. 3,472 కోట్లకు కొనుగోలు చేసి బెయిల్‌ఔట్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోకు కూడా అలాంటి సహాయం లభిస్తుందా..? అని ఎల్ అండ్ టీ కంపెనీ ఎదురుచూస్తోంది.
ఈ సంక్షోభం నగర ప్రజలపై ప్రభావం చూపుతుంది. మెట్రో ఆగిపోతే, ట్రాఫిక్ జామ్‌లు పెరిగి, ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాలు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంది. బడ్జెట్ సపోర్ట్, ఫేర్ హైక్ లేదా ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆకర్షించడం ద్వారా.. హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి మెట్రో అత్యవసరం. ఇది కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు.. ఆర్థిక వృద్ధికి, పర్యావరణ సంరక్షణకు కీలకంగా మారింది. ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని భాగ్యనగర వాసులు కోరుతున్నారు. పీపీపీ మోడల్‌లో రిస్క్‌లను ముందుగా అంచనా వేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.