KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకంటే.. ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని గుర్తు చేశారు. వారితో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో చూపించి “ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా?” అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు “మేము కాంగ్రెస్‌లో చేరలేదు” అని చెప్పడాన్ని కేటీఆర్ నిలదీశారు. అది కాంగ్రెస్ కండువా కాదు అని అంటున్నారు.. మీరు దీన్ని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. “ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి?” అంటూ రాహుల్ గాంధీని నిలదీశారు. రాహుల్ గాంధీకి సిగ్గు లేదని తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తప్పనిసరి అని ఆయన గుర్తుచేశారు.
ALSO READ: Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. రూ.35,400 జీతం.. ఇంకెందుకు ఆలస్యం
ఇలాంటి ఫిరాయింపులు రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పరిస్థితిని చూసుకుని సిగ్గుపడాలని, వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేపాయి. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి, ఉపఎన్నికల్లో పోటీ చేయమని సవాల్ విసిరారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నమ్మకం ఉంటే ఉపఎన్నికలకు రెడీ కావాలని ఛాలెంజ్ చేశారు..
సుప్రీంకోర్టు ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఆదేశాలను కొట్టివేసి, స్పీకర్‌కు నిర్ణయం తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్‌ఎస్ నేతలు ఉప ఎన్నికలకు రావాలని స్పీకర్ పై ఒత్తిడి చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఫిరాయింపులు రాజకీయాల్లో సాధారణమే అయినప్పటికీ.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కేటీఆర్ చెప్పారు. ఇది తెలంగాణలోని రాజకీయ డైనమిక్స్‌ను మార్చే అవకాశం ఉంది.