హైదరాబాద్ మెట్రో విస్తరణ కదిలేదెలా?
సీఎం సంకల్పానికి కరువైన కేంద్ర సహకారం!
కేంద్ర కేబినెట్‌లో రెండో దశ ఊసేలేదు
అనుమతులు, నిధులపై నిరాశ
ఢిల్లీ మెట్రో విస్తరణకు మాత్రం గ్రీన్ సిగ్నల్
రూ.6,230 కోట్లు కేటాయింపు
హైదరాబాద్ మెట్రో ఊసెత్తని వైనం
రాష్ట్రం డీపీఆర్‌పై స్పందన ఏది?
స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
అయినా కనిపించని ఫలితం
ఎందుకీ తాత్సారం?
రాజకీయ కారణాలా?
వ్యక్తమవుతోన్న సందేహాలు
అనుమతులు దక్కగానే పనులు
ఎదురుచూస్తున్న రేవంత్ సర్కారు
స్వేచ్ఛ, సెంట్రల్ డెస్క్: హైదరాబాద్ మహానగరం తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఇంకా చెప్పాలంటే బంగారు బాతు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ భాగ్యనగరాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ సర్కార్ సంకల్పించింది. అందులో భాగంగా రూపొందించిన కీలకమైన ప్రణాళికల్లో మెట్రో విస్తరణ ప్రాజెక్ట్ ప్రధానమైనది. నగరంలో కనెక్టివిటీ పెంపు, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ లక్ష్యాలుగా ఉన్న రెండో దశ విస్తరణను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కానీ సీఎం సంకల్పానికి కేంద్ర ప్రభుత్వ సహకారం సహకారం కానరావడం లేదు. రెండో దశ విస్తరణలో భాగంగా 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలను నిర్మించేందుకు రూ.24,269 కోట్ల వ్యయంతో పంపించిన డీపీఆర్‌పై కేంద్ర కేబినెట్ సానుకూల స్పందించలేదు.
ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి మెట్రో విస్తరణ ప్రాధాన్యతను వివరించిన కేంద్రంలో చలనం కనిపించలేదు. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రస్తావన రాలేదు. అయితే వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న ఢిల్లీలో మెట్రో విస్తరణకు మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.6,230 కోట్ల వ్యయంతో 26.43 కిలోమీటర్ల మేర రిథేలా-నరేలా-నాథ్‌పూర్ కారిడార్‌ను నిర్మించేందుకు ఆమోద ముద్రవేసింది. ఢిల్లీ-హర్యానా మధ్య నిరంతరాయ ప్రయాణానికి ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపామని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు.
స్వయంగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన రేవంత్
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టతతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కకముందే అన్ని విధాలా సంసిద్ధమవ్వాలని, గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే పనులు వేగంగా మొదలుపెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీపీఆర్‌ను కూడా పంపించడం, సీఎం రేవంత్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిశారు. డీపీఆర్‌కు ఆమోదం తెలపడంతో పనులు మొదలు పెట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీంతో హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కానీ వాస్తవ రూపంలో అది కనిపించలేదు. కేంద్ర కేబినెట్‌లో ఈ అంశం ప్రస్తావనకు రాలేదు. అనుమతులు దక్కితే పనులు మొదలుపెట్టవచ్చని ఎదురుచూస్తున్న ప్రభుత్వానికి నిరాశే మిగిలింది.
Also Read: కేసీఆర్ పాలనలోనే ఎక్కువ నష్టం: సీఎం రేవంత్ రెడ్డి
అంతా కేసీఆర్ పుణ్యమే
వాస్తవానికి కేసీఆర్ సర్కారు హయాంలోనే హైదరాబాద్ రెండోదశ మెట్రో విస్తరణ పనులు జరగాల్సి ఉంది. కానీ అడుగు ముందుకు పడలేదు. దీంతో దేశంలోని ఇతర ప్రధాన నగరాలు మెట్రో విస్తరణ విషయంలో ముందుకెళుతున్నా హైదరాబాద్ మాత్రం వెనుకంజలో నిలవాల్సి వచ్చింది. ఆయా నగరాల్లో మెట్రో విస్తరణలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. కానీ హైదరాబాద్ మెట్రో విషయంలో మాత్రం సానుకూల వైఖరి కనిపించడం లేదు. ముంబై, చెన్నై నగరాల్లో పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి మెట్రోను విస్తరిస్తున్నారు. కానీ హైదరాబాద్‌కు ఎప్పటికప్పుడు మొండిచెయ్యి చూపిస్తుండడంతో విస్తరణ విషయంలో 3వ స్థానానికి పరిమితమైంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే మరింత కిందికి దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేంద్రం అనుమతి తప్పనిసరి
మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు కేంద్ర పరిధిలో ఉంటాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పీపీపీ విధానంలో విస్తరణ చేపడతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. డీపీఆర్ ప్రకారం హైదరాబాద్ మెట్రో విస్తరణ అంచనా రూ.24,269 కోట్లు ఉండగా 30 శాతం మేర (రూ.7,313 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం (రూ.4,230 కోట్లు) కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మిగతా 52 శాతం నిధులను పీపీపీ విధానం, రుణాల రూపంలో సమీకరించాల్సి ఉంటుంది.
రాజకీయ కారణాలా?
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్టుకు ఎన్ని నిధులు అవసరమైన విడుదల చేస్తానని తన దృక్పథాన్ని స్పష్టం తెలియజేశారు. నాలుగేళ్లల్లోనే పనులు పూర్తవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన డీపీఆర్‌కు ఇంకా అనుమతి ఇవ్వకపోవడం, పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కారు కావడం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువై ఉండడంతో తాత్సారం జరుగుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పలు రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కనిపించడం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి హైదరాబాద్ మెట్రో విస్తరణ అనుమతి, నిధుల కేటాయింపు విషయంలో ఎలా వ్యవహరించనుందో చూడాలి.
అనుమతి వస్తే హైదరాబాదీలకు హ్యాపీ
హైదరాబాద్ ప్రజా రవాణాలో మెట్రో చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది. ప్రస్తుతానికి మూడు కారిడార్లలోనే నడుస్తున్నప్పటికీ సగటున 5 లక్షలకు పైగా మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతిపాదిత 5 కారిడార్లు కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాదీలకు మరింత ఉపశమనం దక్కుతుంది. ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాదు నగరంలో కనెక్టివిటీ పెరుగుతుంది. ఎందుకంటే రెండోదశలో ప్రతిపాదించిన మార్గాలన్నీ మొదటి దశలోని మూడు కారిడార్లకు కొనసాగింపుగా ఉన్నాయి.
రెండో దశలో డీపీఆర్ ఇవే.
1. నాగోల్ – శంషాబాద్ ఎయిర్‌పోర్టు – 36.8 కి.మీ.
2. రాయదుర్గం-కోకాపేట నియోపొలీస్- 11.6 కి.మీ
3. ఎంజీబీఎస్- చాంద్రాయణగుట్ట – 7.5 కి.మీ
4. మియాపూర్- పటాన్‌చెరువు – 13.4 కి.మీ
5. ఎల్‌బీనగర్ – హయత్‌నగర్ – 7.1 కి.మీ.