Hyderabad Metro Special Arrangements for Ganesh Nimajjanam: ఈ నెల 17వ తేదీన గణపతి నిమజ్జనం. ఇప్పటికే హైదరాబాద్‌లో నిమజ్జనం కోలాహలం మొదలైంది. చాలా రోడ్‌లలో ట్రాఫిక్ పెరిగింది. గణపతి మంటపాల వద్దకు భక్తుల బారులూ దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఇసుక చల్లితే రాలనంత మంది క్యూల్లో కనిపిస్తున్నారు. ఇక్కడికి భక్తులు రావడానికి ప్రభుత్వ రవాణా సౌకర్యాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా మెట్రో రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి. మెట్రో ట్రైన్‌లు భక్తులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మెట్రో గణపతి నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది.
గత వారం రోజులుగా మెట్రోలో ఫుల్ రష్ ఉన్నది. ప్రతి రోజు మెట్రోలో ప్రయాణికుల సంఖ్య ఐదు లక్షలను దాటుతున్నది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేషుడి వద్దకు భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం ఒక్క రోజే ఖైరతాబాద్ మెట్రరో స్టేషన్‌కు సుమారు 94 వేల మంది ప్రయాణికులు వచ్చారు. ఇందులో 39 వేల ప్రయాణికుల ఎంట్రీలు, 55 వేల ఎగ్జిట్లు నమోదయ్యాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెట్రో స్టేషన్‌లలో ముఖ్యంగా ఖైరతాబాద్ స్టేషన్‌లో రష్‌ను మేనేజ్ చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి.. ఈ రోజు ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read: Traffic Restrictions: నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులారా బీ అలర్ట్!
ప్రత్యేక ఏర్పాట్లు ఇవే:
– గణపతి నిమజ్జనం ముగిసే వరకు పీక్ అవర్స్‌లో అదనపు ట్రైన్‌లను ఉపయోగిస్తాం. ట్రైన్‌ల మధ్య నిడివి తగ్గించి వెంట వెంటనే వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు.
– నిమజ్జనం జరిగే 17వ తేదీన మెట్రో ట్రైన్లు అర్ధరాత్రి దాటి కూడా సేవలు అందిస్తాయి. చివరి ట్రైన్ అన్ని డైరెక్షన్‌లలో రాత్రి 1 గంటలకు మొదలవుతాయి. సుమారు గంట తర్వాత డెస్టినేషన్ చేరుకుంటాయి.
– ఖైరతాబాద్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్‌లలో అదనపు పోలీసులు, ప్రైవేటు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
– ఎంపిక చేసుకున్న మెట్రో స్టేషన్‌లలో డిమాండ్‌కు తగినట్టుగా అదనంగా టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేస్తాం.
– ఖైరతాబాద్‌కు విచ్చేసే భక్తులు స్వీయ క్రమశిక్షణ పాటించాలని, భద్రతా సిబ్బందికి సహకరించాలని, తొక్కిసలాట వంటివి జరగకుండా జాగ్రత్తలు వహించాలని ఎన్‌వీఎస్ రెడ్డి ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం గణపతి నిమజ్జనం జరగనుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్ పై రద్దీ ఏర్పడింది. నిమజ్జనాలు మొదలయ్యాయి. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక వీకెండ్ రావడంతో ఈ శని, ఆది వారాల్లో భక్తుల పెద్ద సంఖ్యలో విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే ఖైరతాబాద్ బడా గణేష్ వద్దకు భారీగా భక్త జనం తరలివచ్చింది. ఇందుకు అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాలనూ అధికారులు వాహనదారులకు సూచించారు. పార్కింగ్ ఏరియాలనూ గుర్తించి వెల్లడించారు.