CP Sajjanar: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వేడుకల వేళ శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, మద్యం నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ తెలిపారు. బుధవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ) నుంచి.. పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీపీ, న్యూ ఇయర్ భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవడమే లక్ష్యమని, అయితే చట్టం, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈవెంట్ల సమయపాలన, సౌండ్ నియంత్రణ, మద్యం విక్రయాలు, ట్రాఫిక్ నిబంధనల విషయంలో అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్లు, పార్టీలు, పబ్ కార్యక్రమాలకు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత వేడుకలు కొనసాగించినా, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్స్ వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతుల పరిమితులను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
మద్యం విక్రయాల విషయంలోనూ కఠిన ఆంక్షలు విధించినట్లు సీపీ వెల్లడించారు. వైన్ షాపులు, బార్లు, పబ్బులకు నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత బ్యాక్ డోర్ ద్వారా మద్యం విక్రయాలు జరిపితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ విక్రయాలను పూర్తిగా అడ్డుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశమున్నందున.. ఈసారి ముందస్తుగా చర్యలు చేపడుతున్నామని సీపీ సజ్జనార్ చెప్పారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలతో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ జనవరి మొదటి వారం వరకు కొనసాగుతుందని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, వాహనాల సీజ్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని, కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు.
మద్యం సేవించిన వారు వాహనాలు నడపకుండా క్యాబ్‌లు, డ్రైవర్ల సేవలు వినియోగించాలని సీపీ సూచించారు. రద్దీని సాకుగా చూపి క్యాబ్ కానీ, ఆటో డ్రైవర్లు రైడ్ నిరాకరించినా, అదనపు ఛార్జీలు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే 94906 16555 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ, పోలీసు అధికారులు తమ పరిధిలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు వెళ్లి అక్కడ ఉన్నవారితో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. సమాజంలో ఆసరా అవసరమైన వారికి తోడుగా నిలవడమే నిజమైన వేడుక అని ఆయన పేర్కొన్నారు.
Also Read: మామ-అల్లుడు కలిసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు! చామల కౌంటర్
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, డీసీపీలు శ్వేతా, అపూర్వ రావు, రక్షితా కృష్ణమూర్తి, రూపేష్, వెంకట లక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని ఈ సమావేశం ద్వారా మరోసారి స్పష్టమైంది.