హైదరాబాద్ అకాల వర్షం మరోసారి నగర వాసుల్ని బెంబేలెత్తించింది. మరీ ఎక్కువసేపు కూడా కాదు, జస్ట్ గంటన్నరపాటు వర్షం దంచి కొట్టింది. ఆ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అండర్ బ్రిడ్జ్ ల వద్ద పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది.
అకాల వర్షం మరోసారి హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థ లోపాల్ని బయటపెట్టింది. వర్షంపడితే వరదనీరు పోయేందుకు నాళాల సామర్థ్యం సరిపోదని మరోసారి తేలిపోయింది. ఎక్కడికక్కడ అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హుటాహుటిన లోతట్టు ప్రాంతాలకు చేరుకున్నారు.
తప్పెవరిది..?
గత పదేళ్లలో హైదరాబాద్ ని అద్భుతంగా మార్చేశామంటున్న కేటీఆర్ కనీసం ఇప్పుడైనా నోరు విప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. వీడియోలు షేర్ చేస్తున్నారు. సందర్భం వస్తే చాలు హైదరాబాద్ లో అది చేశాం, ఇది చేశాం, ప్రపంచ నగరంగా మార్చేశామంటూ చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటు. అందులోనూ కేటీఆర్ మరో అడుగు ముందుకేస్తుంటారు. హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చింది తామేనని చెప్పుకుంటారు. తమ పాలనలోనే రియల్ ఎస్టేట్ పీక్స్ కి వెళ్లిపోయిందని, ఫ్లైఓవర్లు వచ్చాయని, అంతర్జాతీయ కంపెనీలు నగరానికి క్యూ కట్టాయని చెబుతుంటారు. కానీ వాస్తవం ఏంటి..? నగరంలో జరిగిన అభివృద్ధి ఏంటి..? వర్షం పడితే నేటికీ నగర ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు..?
పైపై మెరుగులు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి శూన్యం అంటున్నారు నెటిజన్లు. పైపై మెరుగులతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారని, అందుకే నగరంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. హైదరాబాద్ రెయిన్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. హైదరాబాద్ లో చిన్న వర్షానికే ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటున్నారు.
BRS's ten years of development have left the entire city submerged even after the slightest rain#HyderabadRains pic.twitter.com/5iQF7wcf8i
— Kumar Yadav (@KumarYadav1995) April 3, 2025
హైదరాబాద్ ని అభివృద్ధి చేయకపోగా.. గొప్పలు చెప్పుకోవడం దేనికంటూ నెటిజన్లు బీఆర్ఎస్ నేతల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం పదేళ్లపాటు వరుసగా అధికారంలో ఉండి కూడా హైదరాబాద్ పరిస్థితిని మెరుగుపరచలేదని, సరికదా మరింత అధ్వాన్నంగా తయారు చేశారని అంటున్నారు. బీఆర్ఎస్ నేతలు కచ్చితంగా ఈ పరిస్థితికి సమాధానం చెప్పాలంటున్నారు. హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంటే.. ప్రపంచ నగరంగా మారిపోయిందంటూ ఎందుకు ప్రచారం చేసుకున్నారని బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు.
కేటీఆర్ 10 సంవత్సరాలలో హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి ఇది ! #HyderabadRains
— మీ కాపలా కుక్క (@mekaapalaKukka) April 3, 2025
హైడ్రాని ఆడిపోసుకున్నారు కదా..?
కబ్జాల బారినుండి జలవనరులను కాపాడటానికి ఏర్పాడు చేసిన హైడ్రా గురించి అప్పట్లో ఎంతోమంది రచ్చ చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు హైడ్రాని తీవ్రంగా తప్పుబట్టారు. మరిప్పుడు జరుగుతున్నదేంటి..? ఎక్కడికక్కడ నాళాలు కబ్జాకు గురైతే, చెరువుల్లో నిర్మాణాలు వెలుస్తుంటే.. వర్షం నీరు ఎటుపోతుంది. చివరకు నగరాన్ని ముంచెత్తుతుంది. ఈ విషయం తెలిసి కూడా ఓటుబ్యాంకు రాజకీయాలకోసం నగరాన్ని ముంచేసేందుకే మొగ్గు చూపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. చిత్తశుద్ధితో నగర ప్రజల అవస్థలను దూరం చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పాన్ని కూడా నీరుగార్చాలని చూశారు. హైడ్రా చర్యల్ని తప్పుబట్టినవారు ఇప్పుడు వరదనీటి అవస్థల్ని ఎలా సమర్థిస్తారో చూడాలి..?