తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులంతా జనసైనికుల్లా మారారు. ఆయన్ను అభిమానించేవారు ఉన్నట్టే.. అవకాశం వస్తే ఆయన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడి, రాజకీయ లాభం పొందాలని చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే రాజకీయాల్లో పవన్ కి శత్రువులు ఎక్కువగా సినీ ఇండస్ట్రీ నుంచి ఉండటం ఇక్కడ విశేషం. ప్రకాష్ రాజ్ తో మొదలు పెడితే యాంకర్ శ్యామల వరకు చాలామంది పవన్ ని టార్గెట్ చేసి మాట్లాడారు, మాట్లాడుతూనే ఉన్నారు. మరి వీరందరికీ పవన్ అంటే ఎందుకంత పగ..? కేవలం పవన్ కల్యాణ్ ని మాత్రమే వీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.
ప్రకాష్ రాజ్..
నటుడు ప్రకాష్ రాజ్.. సినిమాలకంటే ఎక్కువగా జాతీయ రాజకీయాల గురించి విశ్లేషణ చేస్తుంటారు. కానీ ఆయనకు పవన్ కల్యాణ్ విషయంలో కాస్త ఎక్కువ ఆసక్తి ఉంది. అసలు ప్రకాష్ రాజ్ కి ఏపీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కానీ పదే పదే పవన్ ని టార్గెట్ చేస్తుంటారు. సంబంధం లేని విషయాల్లో కూడా ఆయన పేరు తెస్తుంటారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ తన మేథస్సుని బయటపెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు ప్రకాష్ రాజ్. ఆమధ్య పవన్ కల్యాణ్, జనసేన ఆవిర్భావ దినోత్సవంలో చేసిన కామెంట్లపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. గెలవకముందు జనసేనాని, గెలిచాక భజన సేనాని అంటూ సెటైరిక్ కామెంట్లు పెట్టారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా పవన్ కల్యాణ్ ఆహార్యం గురించి కాస్త అపహాస్యం చేశారు ప్రకాష్ రాజ్. ఆయన రోజుకో వేషం మారుస్తుంటారని, కాస్ట్యూమ్స్ మార్చడానికి ఇదేమీ సినిమా కాదన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడటానికి అసలు పవన్ కి ఉన్న అర్హతలేంటని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు సమస్యల గురించి మాట్లాడిన పవన్, అధికారంలోకి వచ్చాక వాటి గురించి మర్చిపోయారని మండిపడ్డారు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ ప్రకాష్ రాజ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
Sharing a conversation.. do watch n share .. good day #justasking https://t.co/zKjpmWMwlb
— Prakash Raj (@prakashraaj) April 2, 2025
అలీ, పోసాని..
గతంలో పోసాని కృష్ణమురళి పవన్ కల్యాణ్ ని, ఆయన కుటుంబాన్ని ఎంతలా దుర్భాషలాడారో అందరికీ తెలుసు. ఆ కేసులోనే ఆయన ఇటీవల రిమాండ్ కి వెళ్లొచ్చారు. పోసానికి పవన్ పై ఎందుకంత ద్వేషం అనేది ఇప్పటికీ అంతుచిక్కని వ్యవహారం. పవన్ కల్యాణ్ తో ఎన్నో సినిమాలు చేశారు పోసాని. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వారి మధ్య ఎప్పుడూ శత్రుత్వం లేదు. ఆ మాటకొస్తే చిరంజీవి ప్రజారాజ్యంలో కూడా పవన్ తో కలసి పనిచేశారు పోసాని. కానీ వైసీపీలోకి వచ్చిన తర్వాతే పోసానికి పవన్ పై విద్వేషం తారా స్థాయికి వెళ్లిపోయింది. ఆ మాటకొస్తే అసలు పవన్ ని తిట్టాల్సిన అవసరం అలీకి ఏమొచ్చిందనేది ఇంతవరకు అర్థంకాని ప్రశ్న. కానీ వైసీపీలో పదవులకోసం పవన్ కల్యాణ్ ని నానా మాటలు అన్నారు కమెడియన్ అలీ. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు.
రోజా ఘాటు వ్యాఖ్యలు..
పవన్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు రోజా. రాజకీయంలో ఎప్పుడు ఎవరిది పైచేయి అవుతుందో ఎవరికి తెలుసు. ఆ విషయం తెలిసి కూడా పవన్ పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ గెలవలేరని, ఆయనకు అంత సీన్ లేదని రెచ్చగొట్టేలా మాట్లాడేవారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడల్లా పవన్ పై విమర్శలు చేస్తున్నారు రోజా.
యాంకర్ శ్యామల..
ప్రస్తుతం పవన్ పై విమర్శలు చేయడానికి వైసీపీ ప్రయోగించిన అస్త్రం శ్యామల. సినీ ఇండస్ట్రీకే చెందిన శ్యామల.. అవకాశం వస్తే పవన్ పై విమర్శలు ఎక్కుపెడుతుంటారు. శాంతి భద్రతల సమస్యల విషయంలో కూడా పవన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారామె. సత్తా లేదని అంటున్నారని, ఆ విషయం తమకు ముందే తెలుసని కూడా కామెంట్ చేశారు.
అధికారంలో లేనప్పుడు, కనీసం జనసేనకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనప్పుడు కూడా వీరంతా పవన్ నే టార్గెట్ చేసేవారు. ఇప్పుడు కూడా ప్రకాష్ రాజ్, రోజా, శ్యామల వంటి వారు పవన్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు కామన్. కానీ సినీ ఇండస్ట్రీనుంచి వచ్చిన వారే ఎక్కువగా పవన్ ని టార్గెట్ చేయాలని చూడటం, పగబట్టినట్టుగా ప్రవర్తించడం ఇక్కడ విశేషం.