Hhyderabad Rain Alert: తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్యలో.. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు, గాలివానతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటించారు.
రాజేంద్రనగర్, చంద్రాయణగుట్ట, కార్వాన్, శివరంపల్లి, ఎల్‌బీ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, గోల్కొండ, ఆర్సీ పురం, పటాన్‌చెరు, చందానగర్, టోలిచౌకీ, షేక్‌పేట్, చార్మినార్, సేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఈ మోస్తరు నుంచి భారీ వర్షాల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగొచ్చు. రోడ్లపై నీరు చేరిపోవడం, వాహనదారులు ఇబ్బందులు పడటం సహజం. ప్రత్యేకించి పాతబస్తీ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో జలమయం పరిస్థితులు తలెత్తే అవకాశముంది. వర్షాల సమయంలో విద్యుత్ అంతరాయాలు కూడా సంభవించవచ్చు. కాబట్టి ముందుగానే ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షంతోపాటు బలమైన ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా. చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపోవడం, హోర్డింగులు కూలిపోవడం వంటి ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాలు కురుస్తున్న సమయంలో ఇంట్లోనే ఉండటం ఉత్తమం.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ప్రజలకు సూచనలు చేశారు. వర్షాల సమయంలో అవసరం లేకపోతే బయటకు వెళ్లకూడదని, వాహనాలు నడపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. పిడుగులు పడే సమయంలో మొబైల్ ఫోన్లు వాడకూడదని, ఓపెన్ గ్రౌండ్స్‌లో నిలబడి ఉండరాదని, చెట్ల క్రింద వర్షం నుంచి తప్పించుకోవడానికి నిలబడరాదని ప్రజలకు సూచించారు.
వర్షాలు కురిసే సమయాల్లో ఇంట్లోనే ఉండాలి.
పిల్లలను బయటకు పంపరాదు.
వాహనాలు నడిపేటప్పుడు వేగం తగ్గించి జాగ్రత్తగా వెళ్లాలి.
తక్షణ సహాయం అవసరమైతే GHMC కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి.
విద్యుత్ అంతరాయం ఉంటే తక్షణం కరెంట్ అధికారులు ఇచ్చిన నంబర్లకు సమాచారం అందించాలి.
హైదరాబాద్ వాసులు ఈ వర్షాలను తేలికగా తీసుకోరాదు. వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశముంది. తక్కువ సమయంలో భారీ వర్షాలు పడవచ్చు. కాబట్టి ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ముందస్తుగా అవసరమైన ఆహార పదార్థాలు, తాగునీరు, టార్చిలైట్లు సిద్ధం చేసుకోవాలి.
మొత్తానికి, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య.. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు, మెరుపులు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.