Hyderabad Traffic Police: వాహనాల్లో పిల్లల భద్రత, స్కూల్ ట్రాఫిక్ విషయంలో హైదరాబాద్ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. రూల్స్ బ్రేక్ చేస్తే ఇక చట్టమే కఠినంగా వ్యవహరిస్తుంది. స్కూల్ బస్సుల నుంచి డ్రైవింగ్ చేసే మైనర్ల వరకు, కార్‌పూలింగ్ మొదలుకొని సీసీటీవీ కెమెరాల వరకూ.. అన్నీ కొత్త కదలికలే. ఈ కొత్త మార్గదర్శకాలు తెలుసుకోకపోతే, మీరు కూడా ట్రబుల్‌లో పడే అవకాశం ఉంది. మరి, హైదరాబాద్‌లో స్కూల్ ట్రాఫిక్‌కి సంబంధించిన తాజా నిబంధనలు ఏంటీ? పిల్లల భద్రత కోసం ఏం మారింది? పూర్తిగా చదవండి..
ప్రతి తల్లి – తండ్రి, డ్రైవర్, స్కూల్ యాజమాన్యం తెలుసుకోవాల్సిన విషయాలివి!
హైదరాబాద్ స్కూల్ ట్రాఫిక్‌పై సీరియస్ దృష్టి!
జూన్ 19న రవీంద్ర భారతిలో స్కూల్ యాజమాన్యాలు, డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ సమన్వయకర్తలతో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. దీనిలో ముఖ్యాంశం పిల్లల భద్రత. స్కూల్ ప్రాంగణం నుంచి 200 మీటర్ల దూరంలో జరిగిన ఏ ప్రమాదానికైనా స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నది ముఖ్య హెచ్చరిక.
పోలీసుల కీలక ఆదేశాలు..
స్కూల్ బస్సుల్లో తప్పనిసరిగా సీసీటీవీలు, డాష్‌బోర్డ్ కెమెరాలు ఉండాలి. డ్రైవర్లపై పర్యవేక్షణ ఉండాలి, షార్ట్‌కట్ లేని బోర్డింగ్, డిబోర్డింగ్ పద్ధతులు అమలులో ఉండాలి. స్కూల్ సమీప ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించాలి లేదా లీజుకు తీసుకోవాలి. డ్రోన్ కెమెరాలతో స్కూల్ పరిసరాల్లో ట్రాఫిక్ మూల్యాంకనం జరుగుతుంది. వీడియో ఆధారంగా స్కూల్స్‌కి హెచ్చరికలు పంపబడతాయి.
డ్రైవింగ్ చేసే మైనర్లకు 25 ఏళ్లు నిండే వరకు లైసెన్స్ లేదు!
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించిన మరో ప్రధాన సమస్య మైనర్ డ్రైవింగ్. ఇప్పటికే 400కి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇకపై మైనర్ డ్రైవింగ్ చేస్తే, డ్రైవింగ్ లైసెన్స్ 25 ఏళ్లు నిండే వరకు రాదంటూ పోలీస్ హెచ్చరించింది. వాహన యజమానులకు కూడా జైలు శిక్ష, రిజిస్ట్రేషన్ రద్దు వంటి చర్యలు ఎదురవుతాయి.
డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.. షాకింగ్ ఫలితాలు!
జూన్ 18న నిర్వహించిన తనిఖీల్లో స్కూల్ బస్సులను నడిపే 14 మంది డ్రైవర్లు మద్యం సేవించి ఉన్నట్లు బయటపడింది. పోలీసులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు. ఇకపై బ్రీత్ ఎనలైజర్లతో నిరంతర తనిఖీలు జరిగేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోనుంది. పాఠశాలలు తమ డ్రైవర్లపై పూర్తి నియంత్రణలో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
కార్‌పూలింగ్ నిబంధనలు.. ట్రాఫిక్ తగ్గించే టార్గెట్
ఒకే పాఠశాలలో చదివే పిల్లల తల్లిదండ్రులు కార్‌పూలింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ రూపొందించిన కార్‌పూలింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీనిలో ధృవీకరించబడిన యూజర్లు మాత్రమే వాహన ప్రయాణం చేయగలుగుతారు. లైవ్ ట్రాకింగ్, ప్రైవేట్ కమ్యూనికేషన్ వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: Gold Mines in AP: ఆ కొండంతా బంగారమే.. ఈ టాక్ వెనుక అసలు మిస్టరీ ఇదే!
సేఫ్ స్కూల్ పథకం.. పిల్లల భద్రతకు మరో అడుగు
ప్రస్తుతం ఏడు పాఠశాలల్లో ప్రారంభమైన సేఫ్ స్కూల్ పైలట్ ప్రాజెక్ట్ త్వరలో నగరంలోని అన్ని పాఠశాలలకు విస్తరించనుంది. ఈ కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు, టీచర్లు కలిసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తారు.
భవిష్యత్‌కి దారిచూపే చర్యలు
రాబోయే రెండు సంవత్సరాల్లో ORR లోపల డీజిల్ బస్సులు నిషేధం, కేవలం ఎలక్ట్రిక్ బస్సులకే అనుమతి ఇవ్వాలని రవాణా శాఖ తెలిపింది. వాతావరణాన్ని పరిరక్షించడంలో ఇది ఒక పెద్ద అడుగు. డీజిల్ వాహనాల రాకపోకలు నెమ్మదిగా నగరం బయటకు పరిమితమవుతాయి.
హైదరాబాద్‌లో భద్రత.. బాధ్యతకు కొత్త నిర్వచనం!
హైదరాబాద్ నగరాన్ని విద్యార్థులకు మరింత సురక్షితంగా మార్చడానికి పోలీసులు మొదటి అడుగు వేశారు. ఇప్పుడు ప్రతీ స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు కూడా వారి వాటా బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది. నగరంలోని పాఠశాలల వద్ద ఇక నిబంధనలు పాటించకపోతే ఊరుకోరు. పిల్లల భద్రత మీద రాజీ లేకుండా, ప్రతి వాహనం మీద నిఘా కొనసాగుతూనే ఉంటుంది.