WhatsApp Fraud: టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ కేటుగాళ్లు పన్నుతున్న పన్నాగాలు సామాన్యులనే కాదు, పెద్ద పెద్ద కంపెనీల్లో కీలక బాధ్యతల్లో ఉండే వారిని కూడా ముంచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో వెలుగుచూసిన ఒక ఘటన చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్ నమ్మి ఒక అకౌంటెంట్ ఏకంగా రూ. కోటి రూపాయలను సైబర్ దొంగల ఖాతాలో వేసేశాడు.
ముందు జాగ్రత్తే ముంపేరింది
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 54లో నివసించే పెండ్యాల ఉషాలక్ష్మి (50) ఒక సంస్థకు యజమానురాలు. ఇటీవల ఆమె విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో కంపెనీ అత్యవసర ఖర్చుల కోసం ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో, రెండు బ్లాంక్ చెక్కులపై ముందే సంతకాలు చేసి తన నమ్మకస్తుడైన అకౌంటెంట్ ఎం.వి.ఎ.ఎస్. కళ్యాణమూర్తికి ఇచ్చి వెళ్లింది. అయితే యజమాని తీసుకున్న ఈ జాగ్రత్తే సైబర్ నేరగాళ్లకు లక్కీ ఛాన్స్‌గా మారింది.
డీపీ చూసి మోసపోయిన అకౌంటెంట్
ఈ నెల 3వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు ఉషాలక్ష్మి ఫోటోను తమ వాట్సాప్ డీపీ గా పెట్టుకున్నారు. వెంటనే అకౌంటెంట్‌కు మెసేజ్ చేస్తూ.. ‘నేను మీ ఓనర్‌ను, అర్జెంట్‌గా కోటి రూపాయలు పంపించు’ అని పంపారు. అక్కడ ఉన్నది తన మేడమ్ ఫొటోనే కావడం, పర్యటనలో ఉన్నారని తెలిసి ఉండటంతో అకౌంటెంట్ కళ్యాణమూర్తి ఎలాంటి అనుమానం పడలేదు. మేడమ్ స్వయంగా చెప్పారని భావించి.. ఆమె సంతకం చేసిన చెక్కు ద్వారా వెంటనే రూ. కోటి బదిలీ చేసేశాడు.
రెండోసారి మెసేజ్‌తో వెలుగులోకి
కోటి రూపాయలు నొక్కేసిన కేటుగాళ్లకు ఆశ ఆగలేదు. కాసేపటికే మళ్లీ అదే నంబర్ నుంచి ‘మరో రూ. 2.5 కోట్లు బదిలీ చేయి’ అంటూ మెసేజ్ వచ్చింది. ఈసారి అకౌంటెంట్‌కు కాస్త అనుమానం వచ్చింది. వెంటనే ఉషాలక్ష్మికి ఫోన్ చేసి ఆరా తీయగా.. తాను అసలు ఎలాంటి మెసేజ్ పెట్టలేదని చెప్పడంతో కళ్యాణమూర్తి షాక్ తిన్నాడు. జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: వైద్యారోగ్య శాఖలో బిగ్ చేంజ్.. డాక్టర్లు, నర్సులకు ప్రభుత్వం సంచలన ఆదేశాలు!