Women Beekeeping: స్వేచ్ఛ బ్యూరో: గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో కొత్త ఉపాధి మార్గం అందుబాటులోకి వస్తోంది. అడవులు, ప్రకృతి వనరులపై ఆధారపడి జీవించే మహిళలకు తేనెటీగల పెంపకం ద్వారా స్థిరమైన ఆదాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలను శాస్త్రీయ తేనెటీగల పెంపకందారులుగా తీర్చిదిద్దుతూ గ్రామీణ ప్రాంతాల్లో తేనె ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటికే 199 మహిళా తేనెటీగల పెంపకం యూనిట్లు ఏర్పాటు కాగా, 734 మంది మహిళలను ఈ రంగంలోకి తీసుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి మొత్తం 1,500 యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మూడు జిల్లాల్లో 199 యూనిట్లు
సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా ఆధ్వర్యంలోని శాస్త్రీయ తేనెటీగల పెంపకం కార్యక్రమాన్ని తొలిదశలో నాగర్‌కర్నూల్, ములుగు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అమలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే మహిళలకు తేనెటీగల పెంపకాన్ని స్థిరమైన ఆదాయ వనరుగా మార్చడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 1,500 యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఒక్కో జిల్లాలో 500 యూనిట్ల చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 199 యూనిట్లు ప్రారంభమయ్యాయి. మరోవైపు 734 మంది మహిళలను సమీకరించి శిక్షణ, యూనిట్ల ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు.జిల్లాల వారీగా పరిశీలిస్తే నాగర్‌కర్నూల్‌లో 500 యూనిట్ల లక్ష్యానికి గాను 109 యూనిట్లు ఏర్పాటు చేసి, 200 మంది మహిళలను సమీకరించారు. ములుగులో 500 యూనిట్లకు గాను 60 యూనిట్లు ఏర్పాటు కాగా, 245 మంది మహిళలు ముందుకొచ్చారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 500 యూనిట్ల లక్ష్యానికి గాను 30 యూనిట్లు ఏర్పాటు చేసి, 289 మంది మహిళలను సమీకరించారు.
అమ్రాబాద్ నుంచి జైనూర్ వరకు..
క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం విస్తరణ వేగంగా కొనసాగుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో 79, లింగాల మండలంలో 30 యూనిట్లు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో 60 యూనిట్లు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో 30 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సెర్ప్ వెల్లడించింది. మొత్తం మూడు జిల్లాల్లో 13 మండలాల్లో కొత్తగా మహిళా తేనెటీగల పెంపకందారుల సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ అవకాశాలు
సాధారణంగా అడవుల్లోని తేనెపట్టుల నుంచి తేనె సేకరించడం ప్రమాదకరమైన పని. చెట్లెక్కడం, రాళ్ల గుట్టలు, కొండ ప్రాంతాల్లో తేనె సేకరించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అడవుల్లో సహజంగా లభించే తేనెపట్టులు తగ్గిపోతుండటంతో సంప్రదాయ పద్ధతుల్లో తేనె సేకరణ కష్టతరంగా మారుతోంది.ఈ పరిస్థితుల్లో శాస్త్రీయ తేనెటీగల పెంపకం మహిళలకు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారనుంది. ఇళ్లకు సమీపంలోనే తేనెటీగల పెట్టెలను ఏర్పాటు చేసుకుని, వాటి నుంచి క్రమం తప్పకుండా తేనె సేకరించే అవకాశం ఉంటుంది. తేనెటీగల ద్వారా స్థానిక పంటలకు పరాగసంపర్కం జరగడంతో వ్యవసాయానికీ మేలు కలుగుతుంది.
మహిళల భాగస్వామ్యంతో ప్రత్యేక నమూనా
ఈ కార్యక్రమంలో మహిళలను వారి స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంస్థల ద్వారా ఎంపిక చేస్తున్నారు. ఒక్కో మహిళ తేనెటీగల పెంపకం యూనిట్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో తేనెటీగల పెంపకందారు రూ.2,000 స్వీయ వాటాగా అందించాలి. పూలు లభించని కాలంలో తేనెటీగల కాలనీల నిర్వహణ, పోషణకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.స్థానికంగా లభించే వస్తువులతో తేనెటీగల పెట్టెలకు రక్షణ కల్పించే షెడ్లను నిర్మిస్తారు. ఎండ, వాన నుంచి తేనెటీగల కాలనీలను కాపాడేందుకు ఇవి ఉపయోగపడతాయి. తేనెటీగలకు ఏడాది పొడవునా ఆహారం లభించేలా పుష్పించే మొక్కలు, చెట్లను పెంచడానికీ ప్రాధాన్యం ఇస్తున్నారు.
శిక్షణ నుంచి తేనె విక్రయం వరకు..
ఈ కార్యక్రమంలో సాంకేతిక భాగస్వామిగా పనిచేస్తున్న హంబుల్ బీ సంస్థ మహిళలకు శాస్త్రీయ తేనెటీగల పెంపకంపై శిక్షణ అందిస్తోంది. తేనెటీగల పెట్టెలు, తేనెటీగల కాలనీల సరఫరాతో పాటు క్షేత్రస్థాయిలో నిరంతర సహకారం అందిస్తోంది.మహిళలు తాము ఏర్పాటు చేసుకున్న కేంద్రాల వద్ద అవసరమైన స్థలాన్ని సిద్ధం చేసుకుని, నిర్మాణాలు ఏర్పాటు చేసి, తేనెటీగల కాలనీల నిర్వహణ బాధ్యతలను స్వయంగా చేపడుతున్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగల పెంపకం, కాలనీల సంరక్షణ, తేనె సేకరణపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.ఇప్పటికే ఏర్పాటు చేసిన కొన్ని యూనిట్లలో తేనెటీగల కాలనీలను ప్రవేశపెట్టిన కొద్ది వారాల్లోనే తేనె నిండటం ప్రారంభమైందని కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఇది మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
రూ.5 వేల నుంచి రూ.8 వేలతో షెడ్లు
మహిళా తేనెటీగల పెంపకం యూనిట్ల ఏర్పాటును మరింత సులభతరం చేసేందుకు సెర్ప్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. పది తేనెటీగల పెట్టెలకు సరిపోయే తక్కువ ఖర్చు షెడ్ల నమూనాను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకు సుమారు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. సెర్ప్, హంబుల్ బీ సంయుక్తంగా ఈ నమూనాను రూపొందిస్తున్నాయి. ఆచరణ సాధ్యతను పరిశీలించేందుకు ముందుగా ఒక నమూనా షెడ్‌ను నిర్మించనున్నారు.
ఇతర పథకాలతో అనుసంధానం
తేనెటీగల పెంపకాన్ని మరింత మంది మహిళలకు చేరువ చేసేందుకు వివిధ ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయాలని సెర్ప్ భావిస్తోంది. ముఖ్యంగా వి.బి.-జి రామ్ జీ పథకం కింద తేనెటీగల పెంపకం షెడ్ల ఏర్పాటుకు అవసరమైన సహకారం పొందేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ అభివృద్ధి కార్యక్రమం (ఎంఐడీహెచ్), ప్రకృతి వ్యవసాయం, జీవ వనరుల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కూడా మహిళలకు మద్దతు అందించే దిశగా చర్యలు చేపడుతోంది.తేనెటీగలకు ఏడాది పొడవునా ఆహారం లభించేలా వాతావరణ మార్పులను తట్టుకునే పుష్పించే మొక్కలు, చెట్లను తేనెటీగల పెంపకం కేంద్రాల చుట్టూ పెంచాలని నిర్ణయించింది. తద్వారా తేనెటీగల కాలనీల మనుగడతో పాటు తేనె ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుంది.
జనవరి 31లోగా లక్ష్యం పూర్తి
ప్రస్తుతం తేనెటీగల పెంపకం సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేయాల్సిన అన్ని యూనిట్లను వచ్చే ఏడాది జనవరి 31 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సెర్ప్ లక్ష్యంగా పెట్టుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్ణయించిన ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లా యంత్రాంగాలతో కలిసి చర్యలు చేపడుతోంది. ప్రతి వారం పురోగతిని సమీక్షిస్తూ, అవసరమైన చోట సమస్యలను పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించింది.
హంబుల్ బీ సేవలు దేశవ్యాప్తంగా..
ఈ కార్యక్రమానికి సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న హంబుల్ బీ సామాజిక సంస్థ శాస్త్రీయ తేనెటీగల పెంపకం, పరాగసంపర్క సేవల రంగంలో పనిచేస్తోంది. గ్రామీణ మహిళలకు తేనెటీగల పెంపకం క్లస్టర్లను ఏర్పాటు చేయడం, ఆధునిక పద్ధతుల్లో తేనెటీగల కాలనీల నిర్వహణ, తేనె సేకరణ, కొనుగోలు, ఉత్పత్తుల ట్రేసబిలిటీ వంటి సేవలను అందిస్తోంది.దేశవ్యాప్తంగా 2,800 మందికి పైగా మహిళా తేనెటీగల పెంపకందారులతో కలిసి పనిచేస్తున్న ఈ సంస్థ సుమారు 10,500 తేనెటీగల పెట్టెలను నిర్వహిస్తోంది. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ప్రభుత్వ శాఖలు, అభివృద్ధి సంస్థలతో భాగస్వామ్యంగా పనిచేస్తోంది.తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సెర్ప్, హంబుల్ బీ సంస్థలు 2026 ఫిబ్రవరిలో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మహిళలను ఎంపిక చేయడం, వారికి శిక్షణ అందించడం, తేనెటీగల పెట్టెలు, కాలనీల సరఫరా, క్షేత్రస్థాయిలో సహకారం అందించడం వంటి బాధ్యతలను హంబుల్ బీ నిర్వహిస్తుండగా, సెర్ప్ మహిళా సంఘాల సమీకరణ, జిల్లా యంత్రాంగాలు, ప్రభుత్వ శాఖల సమన్వయం వంటి బాధ్యతలను చేపడుతోంది.అడవుల అంచుల్లోని గ్రామీణ మహిళలకు తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయం అందించడంతోపాటు, ప్రకృతి వ్యవసాయం, జీవవైవిధ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. లక్ష్యం మేరకు 1,500 యూనిట్లు అందుబాటులోకి వస్తే మూడు జిల్లాల్లో మహిళల ఆధ్వర్యంలో కొత్త గ్రామీణ ఉపాధి వ్యవస్థకు పునాది పడనుంది.
Also Read: పులివెందులలో హోరా హోరీ.. ఆధిక్యంలో వైసీపీ పార్టీ.. వెనుకంజలో టీడీపీ!