Adi Srinivas: పంటలు ఎండిపోతున్నాయంటూ బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చేస్తోన్న వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎల్పీ మీడియా సెంటర్‌లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోలేదని, వర్షాభావంతో బోర్లలో నీళ్లు లేకపోవడమే అసలు కారణమని స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావంతో వచ్చిన అనావృష్టిని ‘రేవంత్ రెడ్డి సృష్టి’ అని మాట్లాడటం హరీష్ రావు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.
కాళేశ్వరం వైఫల్యం..
కేసీఆర్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, అన్నారం, సుందిళ్లలో సీపేజీలు ఉన్నాయని గుర్తుచేశారు. మేడిగడ్డ దగ్గర కటక వత్తితే నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్మించిన ఎల్లంపల్లినే ఇప్పుడు రైతులకు ఆధారంగా మారిందన్నారు. దిగువ గోదావరిలో నీటిని సమర్థంగా వాడుతున్నామని, బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనతో పోలిస్తే దేవాదుల నుంచి ఏటా 89 శాతం అధికంగా నీటిని ఎత్తిపోశామని గణాంకాలతో విమర్శించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం
కృష్ణా నీటి వాటాలో ఉమ్మడి రాష్ట్ర కేటాయింపుల్లో తెలంగాణకు 299 టీఎంసీలకే ఒప్పుకుని కేసీఆర్, హరీష్ రావులు తీవ్ర ద్రోహం చేశారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ న్యాయమైన వాటా 558 టీఎంసీల కోసం గట్టిగా పోరాడుతోందన్నారు. రైతుల సమస్యలను రాజకీయం చేయడానికి ఫామ్ హౌస్ వదిలి రోడ్లెక్కిన హరీష్ రావు, పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
Also Read: సర్కార్ ఆదాయ వేట.. హైదరాబాద్ పారిశ్రామిక భూములపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!