Hydra Ranganath: ఒక అడుగు.. ఎంతో మందికి స్పూర్తి అయింది. ఒక అడుగు మరెందరికో బాసటగా మారింది. ప్రభుత్వ స్థలాలను చెరబట్టిన వారి చెర నుంచి కాపాడింది. విపత్తుల్లోనూ నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది. ఓవరాల్ గా బతుకు.. బతికించు అన్న కాన్సెప్ట్ తో హైడ్రా దూసుకెళ్తోంది. తాజాగా జూబ్లీ ఎన్ క్లేవ్ లో 400 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాపాడింది.
ఈ నేల 21న బుల్డోజర్లతో నేలమట్టం
దీని విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 400 కోట్ల రూపాయలుగా ఉంటుందని లెక్కగట్టారు. అంత డిమాండ్ ఉన్న చోట జనాల అవసరాలకు వాడాల్సిన ప్లేస్ ను ఆక్రమించి లక్షలు జేబులో వేసుకుంటున్నారు. ఎన్ క్లేవ్ కు చెందిన వాళ్లు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తాజాగా హైడ్రా కమిషనర్ కు కంప్లైంట్ చేయగా.. తన టీమ్ తో వచ్చి పరిశీలించారు. నాన్చే పనే లేదు. మధ్యవర్తుల మాటే ఉండదు. కబ్జా అని తేలితే చాలు బుల్డోజర్లు దిగాల్సిందే. సో ఇవన్నీ కబ్జాలే అని నిర్ధారించుకుని.. ఈనెల 21న బుల్‌డోజర్‌తో తొలగించారు. ఏసీపీ శ్రీకాంత్, సీఐలు బాలగోపాల్, రాజశేఖర్ నేతృత్వంలో కూల్చివేతలు జరిగాయి. వెంటనే ఆ స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. హైడ్రా ఆవిర్భవించాక తొలగించిన కబ్జాల్లో అత్యంత ఖరీదైన స్థలం ఇదే.
8500 గజాలు ఉండే రెండు పార్కుల కబ్జా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ ప్రాంతంలో హైటెక్‌సిటీ సమీపంలో 22.20 ఎకరాల్లో జూబ్లీ ఎన్‌క్లేవ్ లేఅవుట్ ఉంది. 1995లోనే ఈ లేఅవుట్ వేశారు. మొత్తం 100 ప్లాట్లు ఉన్నాయి. రూల్స్ ప్రకారం రోడ్లు, నాలుగు పార్కులకు స్థలం వదిలారు. వీటిలో 8500 గజాలు ఉండే రెండు పార్కులను ఓ వ్యక్తి కబ్జా చేశాడు. అలాగే రోడ్లకు వదిలిన ప్రాంతంలో 5 వేల గజాలతోపాటు.. మరో 300 గజాల ప్రభుత్వ స్థలాన్నీ ఆక్రమించారు. ఈ స్థలాల్లో హోటల్ ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చారు. అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగులు పెట్టారు. వీటన్నిటిపైనా నెలకు 4 లక్షలకు పైగా కిరాయిలు వసూలు చేస్తున్నట్లు హైడ్రా గుర్తించింది. గతంలో జీహెచ్‌ఎంసీకి స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా నోటీసులివ్వడం తప్ప రిజల్ట్ రాలేదు. కానీ కాలనీ అసోసియేషన్ హైడ్రాకు కంప్లైంట్ చేయడంతో కథ మొత్తం మారిపోయింది. కబ్జాకు తెరపడింది. మాదాపూర్ జూబ్లీ ఎంక్లేవ్ వద్ద పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. సో ఇది హైడ్రాకు భారీ విజయం. ఇక్కడ చూడండి.. ఇది కూకట్ పల్లి నల్ల చెరువు. ఒకప్పుడు 17 ఎకరాలకు కుచించుకుపోయి నీళ్లు లేక వెలవెలబోయింది. ఇప్పుడు ఆక్రమణలు తొలగించాక 27 ఎకరాలకు పెరిగింది. నీళ్లు నిండడంతో జలకళ ఉట్టిపడుతోంది. స్థానికులకు ఈ చెరువు చాలా రిలీఫ్ ఇస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా మంది ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. అంటే ఒక ప్రయత్నం ఫలించి ఇదిగో ఇలా కల సాకారమయ్యేలా చేసింది. నల్ల చెరువులు ధగధగా మెరిసేలా చేసింది. ఇదంతా హైడ్రా సక్సెస్ స్టోరీ.
అక్రమ నిర్మాణాలు, నిర్మాణ వ్యర్థాలు, చెత్త పిచ్చిమెుక్కలతో ఆనవాళ్లు కోల్పోతూ మురికి కుంటలుగా మారిన చెరువులను హైడ్రా ఒక్కొక్కటిగా సరి చేస్తోంది. దీంతో నగరంలోని చెరువులు, కుంటలు జలకళతో కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. ఇటీవలే బతుకమ్మ కుంటకు పూర్వవైభవం తెచ్చిన హైడ్రా… సిటీ జనంతో శెభాష్ అనిపించుకుంది. తాజాగా కూకట్‌పల్లిలోని నల్ల చెరువు పునరుద్దరణ ప్రక్రియను పూర్తి చేసి పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. హైడ్రా చొరవతో కబ్జాల చెర నుంచి బయటపడింది ఈ నల్ల చెరువు. కేవలం 4 నెలల్లోనే నల్లచెరువు చెరువు రూపురేఖలు మారిపోయాయి. నేడు సరికొత్తగా మారింది. అందరినీ ఆకర్షిస్తోంది. ఒకప్పుడు దుర్గంధం అన్న వారే ఇప్పుడు అక్కడ వచ్చి సేద తీరుతున్నారు. ఇదీ హైడ్రా పని తీరుకు ఒక ఉదాహరణ మాత్రమే. గాంధీ హాస్పిటల్ ఆవరణలోని నిర్మాణంలో ఉన్న ఓ సంపులో వ్యక్తి పడిపోయాడు. ఇతన్ని హైడ్రా టీమ్ కాపాడింది. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. గాయపడ్డ వ్యక్తిని గాంధీ హాస్పిటల్ తరలించారు. కూల్చడమే కాదు.. ప్రాణాలు కాపాడడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ఇవన్నీ పనుల్ని హైడ్రా చేస్తోంది. ఏడాదిలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. విమర్శలు ఎదుర్కొంది. అసత్య ప్రచారాల బారిన పడింది. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తోంది హైడ్రా.
కబ్జా చేసిన వారిపై ఉక్కుపాదం
హైడ్రా తన పని తాను చేస్తూనే.. అసత్య ప్రచారాలకు చెక్ పెట్టాల్సిన పని కూడా చేయాల్సి వస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియాల్లో హైడ్రా ఏ పని చేసినా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయ్. మరోవైపు ఏర్పాటైన ఏడాదిలోనే 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను హైడ్రా రక్షించింది. వాటి విలువ 30 వేల కోట్ల పైనే ఉంటుంది. ఆరు చెరువుల విస్తీర్ణాన్ని రెట్టింపు చేసి పునరుద్ధరిస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తోంది. సహజవనరులు కాపాడాలి.. సిటీలో జనానికి ఉపశమనం కల్పించాలి. వరదలు, విపత్తులు వస్తే రంగంలోకి దిగాలి. ఇదే హైడ్రా కాన్సెప్ట్. ఈ తరహా వ్యవస్థ మన దగ్గర కొత్తది. అయితే వస్తూనే హైడ్రా చాలా సంచలనాలు సృష్టించింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఒకదశలో హైడ్రా బుల్డోజర్లు సిటీ నలుమూలలా పరుగులు తీశాయి. ముఖ్యంగా చెరువులను కబ్జా చేసి కట్టినవాటిపై కఠినంగానే వ్యవహరించారు. ఇప్పుడు అవన్నీ ఫలితాలు ఇస్తున్నాయి.
30 ఏళ్లుగా కుచించుకుపోయిన బతుకమ్మ కుంట
హైడ్రా సక్సెస్ లో ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంట. ముగిసిన చరిత్ర అనుకున్నదాన్ని కాపాడారు. 16 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన బతుకమ్మ కుంట ఆక్రమణల కారణంగా 5 ఎకరాలకు తగ్గింది. ఈ చెరువును కాపాడేందుకు హైడ్రా పెద్ద న్యాయపోరాటమే చేయాల్సి వచ్చింది. రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు ఇచ్చిన ఎవిడెన్స్ తో ఇటీవల బతుకమ్మకుంట పరిధిని డిసైడ్ చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో హైడ్రా చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టింది. బతుకమ్మ కుంట అంటే అంబర్ పేటలో ఒక సెంటిమెంట్. అలాంటి చెరువు గత 30 ఏళ్ల నుంచి నెమ్మది నెమ్మదిగా ఆక్రమణలకు గురై కుచించుకుపోయింది. ఇన్నేళ్లకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఇటీవల హైడ్రా తొలి వార్షికోత్సవం సందర్భంగా జులై 18న బతుకమ్మకుంట దగ్గరే విద్యార్థులు, స్థానికులతో కలిసి పెద్దఎత్తున మానవహారం నిర్వహించారు. అందరితో నీటి వనరుల పరిరక్షణపై హైడ్రా ప్రతిజ్ఞ చేయించింది. ఆ సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని, జనం ఆస్తుల్ని ఆక్రమణదారులకు చిక్కకుండా ప్రజలే పరిరక్షించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బతుకమ్మ సంబురాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారన్నారు. అందుకు తగ్గట్లే బతుకమ్మకుంటను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
వీటి విలువ రూ.30 వేల కోట్లకు పైనే
ఏడాదిలో హైడ్రాకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. విపత్తుల నిర్వహణకు సంబంధించి పక్కా ప్రణాళికతో హైడ్రా వెళ్తోంది. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించింది టీమ్. ఈ స్థలాల విలువ దాదాపు 30 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని లెక్క తేలింది. సిటీ పరిధిలోని ఆరు చెరువులను పునరుద్ధరించే పనిలో ఉంది హైడ్రా. ఆ చెరువుల విస్తీర్ణం రెట్టింపు స్థాయిలో పెంచింది. రోడ్లపై, మూసీలో వృథాగా పోయే నీటిని చెరువుల్లోకి మళ్లిస్తున్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షిస్తోంది హైడ్రా. న్యాయపరమైన సవాళ్లను కూడా అధిగమిస్తూ భూములను కాపాడుతోంది. కూల్చడమే కాదు నిర్మాణం చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుందని, చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చింది హైడ్రా.
సుప్రీంకోర్టు ఉత్తర్వుత ప్రకారమే హైడ్రా విధులు
ఆక్రమణలను నివారించడంతో పాటు.. హైడ్రా రాకముందు నిర్మించుకున్న ఇళ్లకు మినహాయింపు ఇచ్చింది హైడ్రా. దీంతో ఇండ్లు నిర్మించుకున్న వారికి రిలీఫ్ ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం హైడ్రాకు ఒక నిర్దిష్టమైన విధానాన్ని సూచించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తగ్గట్లు హైడ్రా పనిచేస్తుంది. ఆక్రమణల వెనుక ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టేది లేదంటూ ముందుకు కదులుతోంది. మూసీ తొలగింపులతో సంబంధం లేకున్నా హైడ్రాకు ముడిపెడితే.. ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఓటు ఓవైసీ కాలేజ్ విషయంలోనూ హైడ్రా చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది. ఒవైసీ కళాశాల 2015-16లో నిర్మించారని, సల్కం చెరువుకు తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదంటున్నారు హైడ్రా కమిషనర్. నగరంలోని 80 శాతం చెరువులకు తుది నోటిఫికేషన్ ఇంకా జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఏ వర్గం కాలేజ్ అయినా ఒకటే రూల్ వర్తిస్తుందంటున్నారు. నగరంలోని ఆరు చెరువుల పునరుద్ధరణలో భాగంగా తమ్మిడికుంట చెరువును హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఈ చెరువులో పూడిక తీసి.. వరద కాలువను డైవర్ట్ చేసింది. ఈ కాలువల్లో పూడికను కూడా తొలగించడంతో ఇప్పుడు అక్కడ వరద నీరు నిలవడంలేదు. చెరువులోకి వరద నీరు చేరి సాఫీగా కిందకు సాగుతోంది. ఈ చెరువు విస్తీర్ణం 29.26 ఎకరాలు ఎఫ్‌టీఎల్ గా నిర్ధారించారు. కోర్టు తీర్పును హైడ్రా పట్టించుకోవడంలేదన్న ప్రచారాన్ని హైడ్రా ఖండించింది. సో కథ మార్చేసింది.
Story By Vidya Sagar, Bigtv