HYDRA Marshals strike: హైదరాబాద్‌లో హైడ్రా మార్షల్స్ జీతాలపై చెలరేగిన ఆందోళన… ఇప్పుడు సద్దుమణిగింది. జీతాల్లో కోత విధించారనే వార్తలతో ఉద్రిక్తత పెరిగినా, తాజా పరిణామాలు మార్షల్స్ కు ఊరటనిచ్చాయి. మొదట్లో, “29 వేల జీతంలో 7 వేల తగ్గించారు” అనే ఆరోపణలతో మార్షల్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు, ఎమర్జెన్సీ సేవలు, మాన్సూన్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించే ఈ మాజీ ఆర్మీ సైనికులు, జీతాల విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదని ప్రకటించారు.
కానీ… హైడ్రా కమిషనర్ స్వయంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో చర్చించి, “మార్షల్స్ జీతాల్లో కోత ఉండదు. పాత జీతాలే కొనసాగుతాయి” అని స్పష్టం చేశారు. ఈ హామీతో ఉద్రిక్తత గణనీయంగా తగ్గింది. ఇక ప్రజావాణి సేవలు… గతంలో వచ్చిన సమాచారం ప్రకారం ఆగిపోయాయని ప్రచారం జరిగినా, వాస్తవానికి అవి యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎక్కడా విధులు ఆగలేదు. కంట్రోల్ రూమ్‌లో కూడా మార్షల్స్ హాజరై తమ పనిని కొనసాగిస్తున్నారు. సాలరీస్ తగ్గించే జీవో విడుదల చేసిన విషయం నిజమే అయినా, అది తక్షణం అమల్లోకి రాదని, అలాగే సంబంధిత మార్పులు లేకుండా పాత జీతాలే అకౌంట్లలో జమవుతాయని హైడ్రా అధికారులు ధృవీకరించారు.
అందుకు నిదర్శనం… ఈరోజే కంట్రోల్ రూమ్ మార్షల్స్ అకౌంట్లలో పాత జీతాలు జమ అయ్యాయి. దీంతో, ఆందోళనలో ఉన్న మార్షల్స్ కు ఊరటనిచ్చింది. ఈ పరిణామం ఒక పెద్ద సందేశాన్ని ఇస్తోంది. ఏ సమస్య వచ్చినా, అధికారుల జోక్యం, చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమే. మార్షల్స్ కూడా, ప్రజల భద్రత కోసం తాము ఎప్పటికీ వెనక్కి తగ్గబోమని మరోసారి స్పష్టం చేశారు.ఇప్పుడు పరిస్థితి స్థిరపడినప్పటికీ, భవిష్యత్తులో జీతాల అంశంలో ఎటువంటి అయోమయం రాకుండా GHMC, HYDRA అధికారులు స్పష్టమైన పాలసీ రూపొందించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.హైదరాబాద్ ప్రజలకు ప్రస్తుతం ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే… ఎమర్జెన్సీ సేవలు, ప్రజావాణి స్పందన, కూల్చివేతలు, మాన్సూన్ ఆపరేషన్లు అన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి వచ్చేంత వరకు ఎటువంటి ఆందోళన చేయమని తెలిపారు. ఒకవేళ జీతాల్లో కొతలు యధావిధిగా కొనసాగితే ఆందోళన చేయడమే కాకుండా రాజీనామా చేస్తామని హైడ్రా మార్షల్స్ తెలిపినట్లు సమాచారం.