Harbhajan Singh On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఫీల్డింగ్ వ్యవహారంపై హర్భజన్ సింగ్ (Harbhajan Singh) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద సోమరిపోతని…అతనికి బ్యాటింగ్ తప్ప, ఫీల్డింగ్ చేతకాదని పరువు తీశారు. ఒక్క క్యాచ్ కూడా సరిగ్గా పట్టేవాడు కాదన్నారు. తన బౌలింగ్ లో కూడా ఓ సారి క్యాచ్ వచ్చినా వదిలేశాడని మండిపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్భజన్ సింగ్ కీలక విషయాలను చెప్పారు. సెహ్వాగ్ మంచి బ్యాటర్ అయినప్పటికీ, ఫీల్డింగ్ సరిగ్గా చేసేవాడు కాదన్నారు. అతడు ఎప్పుడూ షార్ట్ మిడ్ వికెట్ దగ్గరే ఫీల్డింగ్ చేసేవాడని తెలిపారు.
దీంతో ప్రత్యర్థులు అతని వైపే ఎక్కువగా షాట్లు ఆడేవారని వెల్లడించారు. తన బౌలింగ్ లో కూడా ఓ బ్యాటర్ కావాలనే వీరేంద్ర సెహ్వాగ్ వైపు షాట్ ఆడినట్టు గుర్తు చేశారు. ఇక ఆ బంతిని పట్టుకోకుండా, దాని వెనకాలే వీరూ పరిగెత్తాడని ఫైర్ అయ్యాడు. దీంతో బౌండరీ వెళ్లిందని, ఈ క్రమంలో తాను గట్టిగా అరిచేశానని చెప్పారు. ఈ తరుణంలోనే ఎందుకు అలా అరుస్తున్నావ్…? అదనంగా వచ్చిన పరుగులను తాను బ్యాటింగ్ కు దిగినప్పుడు రాబడతానంటూ తనకు రివర్స్ గా వీరూ ఆన్సర్ ఇచ్చినట్టు గుర్తు చేశారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ ఫీల్డింగ్ వ్యవహారంపై హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2005లో కోచ్ బాధ్యతలు తీసుకున్న గ్రెగ్ చాపెల్ టీమిండియాను మూడు ముక్కలు చేశాడని హర్భజన్ సింగ్ ఆరోపించారు. ఆస్ట్రేలియాను ఎదుర్కునే శక్తిగా టీమిండియా తయారవుతున్న క్రమంలో ప్లేయర్ల మధ్య గొడవలు సృష్టించి, జట్టును బలహీనం చేశాడని వెల్లడించాడు. గ్రెగ్ చాపెల్ ఆస్ట్రేలియాకు చెందిన వాడు కావడంతో కోచ్ అవతారంలో వచ్చి టీమిండియాను నాశనం చేశాడని ఆగ్రహించాడు.
2007 వరల్డ్ కప్‌లో టీమిండియా గ్రూప్ స్టేజ్ నుంచే ఎలిమినేట్ కావడానికి గల కారణాలను కూడా ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ వివరించాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత విభజించు-పాలించు అన్నట్టుగా గ్రెగ్ చాపెల్ వ్యవహరించాడని మండిపడ్డాడు. గంగూలీ కెప్టెన్‌గా పనికిరాడని బీసీసీఐకి ఫిర్యాదు చేసి మరి టీమిండియాను దెబ్బ కొట్టాడని ఆగ్రహించాడు. సీనియర్ క్రికెటర్ల మధ్య గొడవలు సృష్టించి, జట్టును ముక్కలు చేశాడని ఆరోపించాడు. ఈ క్రమంలోనే 2007 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడిపోయి గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ అయిందన్నారు. ఆ తర్వాత చాపెల్‌ను బీసీసీఐ తప్పించిందని గుర్తు చేశాడు.