Fox Sagar: చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా మరోసారి ఆక్రమణలపై కొరడా ఝళిపించింది. ఫాక్స్‌సాగర్ చెరువు పరిధిలో ఏళ్లుగా విస్తరిస్తున్న అక్రమ నిర్మాణాలకు సోమవారం అడ్డుకట్ట వేసింది. చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిని ఆక్రమించి నిర్మించిన ప్రహరీలు, ఇనుప కంచెలను తొలగిస్తూ చెరువు పునరుద్ధరణ దిశగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబీకులకు చెందిన ఫామ్‌హౌస్ ప్రహరీని సైతం కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ఫాక్స్‌సాగర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో సుమారు అర కిలోమీటరు మేర బండ్ నిర్మించడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణించింది. ఈ బండ్‌ను హద్దుగా చేసుకుని ఫామ్‌హౌస్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ప్రహరీని సోమవారం కూల్చివేసింది. మరికొన్ని ప్రాంతాల్లో సరిహద్దులుగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను కూడా తొలగించింది.
దూలపల్లి గ్రామ పరిధిలోని ఫాక్స్‌సాగర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబీకులకు చెందిన ఫామ్‌హౌస్ ఉన్నట్లు హైడ్రా గుర్తించింది. సర్వే నంబరు 124లో చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని పట్టించుకోకుండా మట్టిని నింపి ప్రహరీ నిర్మించడంతోపాటు గేటును ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నిర్మాణాలు చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుండటంతో ప్రహరీ, గేటును తొలగించారు. ఈ ప్రాంతంలో సుమారు 15 ఎకరాల మేర చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి ఆక్రమణలు విస్తరించినట్లు హైడ్రా గుర్తించింది.
జీడిమెట్ల పరిధిలోని సర్వే నంబర్లు 41, 42లో ఫాక్స్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చిన మరో ప్రహరీని కూడా హైడ్రా తొలగించింది. ఈ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల మేర ఆక్రమణలకు సంబంధించిన ప్రహరీ ఉన్నట్లు గుర్తించి చర్యలు చేపట్టింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది సౌరభ్‌రాజ్ వర్మ ప్రయత్నించినట్లు తెలిసింది. తన తండ్రి దీపక్ వర్మ, పినతండ్రి ప్రశాంత్ వర్మల వారసుడిగా పేర్కొంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, అధికారులు ఎఫ్‌టీఎల్ హద్దులను చూపించారు. ఆక్రమణలు చెరువు పరిధిలోనే ఉన్నట్లు స్పష్టం చేస్తూ ప్రహరీని తొలగించారు. ఫాక్స్‌సాగర్ చెరువు పరిరక్షణ, పునరుద్ధరణలో భాగంగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలోని ఆక్రమణలను గుర్తించి తొలగించే చర్యలను హైడ్రా ముమ్మరం చేసింది.
Also Read: ఇక కరీంనగర్-వరంగల్ నాన్‌స్టాప్ బస్సులు.. పూర్తి షెడ్యూల్ ఇదే?