Electric Buses: కరీంనగర్ – వరంగల్ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఆర్టీసీ సరికొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా నేటి నుంచి నాన్‌స్టాప్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. నూతనంగా అందుబాటులోకి వచ్చిన రహదారి మీదుగా ఈ సర్వీసులు పరుగులు తీయనున్నాయి.
కరీంనగర్ డిపోకు చెందిన నాలుగు అధునాతన విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులకు డీలక్స్ బోర్డులు ఏర్పాటు చేసి నాన్‌స్టాప్‌గా నడుపుతున్నారు. నూతన బైపాస్ రోడ్డు మార్గంలో ఈ సర్వీసులు ప్రయాణించనుండటంతో శంకరపట్నం (కేశవపట్నం), హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి తదితర ప్రాంతాల్లో ఎక్కడా ఆగవు. పట్టణాలు, మండల కేంద్రాలను తాకకుండా బస్సులు నేరుగా బైపాస్ మీదుగానే గమ్యానికి చేరుకుంటాయి.
ఈ నాన్‌స్టాప్ బస్సులకు డీలక్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. డీలక్స్ హోదా ఉండటంతో మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ (మహాలక్ష్మి) పథకం వీటికి వర్తించదు. ఈ బస్సులను తొలుత వరంగల్‌కు ఒక ట్రిప్పు, అనంతరం హనుమకొండకు రెండు ట్రిప్పుల చొప్పున నడుపుతున్నట్లు డ్రైవర్లు తెలిపారు.
కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, వాణిజ్య వర్గాలు, వివిధ రంగాల ప్రొఫెషనల్స్‌కు ఈ నాన్‌స్టాప్ సర్వీసులు పెద్ద ఊరటనివ్వనున్నాయి. మార్గమధ్యంలో ఎలాంటి హాల్టింగులు లేకపోవడంతో సమయం గణనీయంగా ఆదా కానుంది.
Also Read: కన్‌స్ట్రక్షన్లకు మంచినీళ్లు వాడుతున్నారా.. జలమండలి మరో మాస్టర్ ప్లాన్!