HYDRAA: స్వేచ్ఛ బ్యూరో: చెరువుల పునరుద్దరణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఈ క్రమంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్నిహైడ్రా పెద్ద ఎత్తన చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఆరు చెరువుల పనులు పూర్తి కాగా, మరో 14 చెరువులను హైడ్రా రెండో దశలో చేపట్టినట్లు ఆయన వివరించారు. నగరంలో చెరువులు, కాలువలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు వరదలు లేని, పర్యావరణ హితమైన నగరాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అనేక సవాళ్లు ఎదురైనా, హైడ్రా ముందుకెళ్తుందని తెలిపారు.
హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ ..
పర్యావరణ పునరుద్ధరణ, పరిశ్రమలు- అధికారుల పాత్రపై సీఎస్ఐఆర్, ఐఐసీటీలో జరిగిన జాతీయ సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ ఎన్ఆర్ఎస్సీ లెక్కల ప్రకారం నగరంలో 61 శాతం చెరువులు కనుమరుగవ్వగా, మిగతావి ఆక్రమణలకు గురై ఉనికిని కోల్పోయాని తెలిపారు. ఇలాంటి దశలో ఆక్రమణలు తొలగించడం ఒక ఎత్తయితే, అందులో 5 నుంచి 6 మీటర్ల మేర పేరుకుపోయిన పూడికను తొలగించడం మరో సవాల్‌గా మారిందన్నారు. చెరువు ఆనవాళ్లు లేని బతుకమ్మకుంటను తవ్వి ఆ పరిసరాల్లో వరద లేకుండా చేశామన్నారు. మాధాపూర్‌లో తమ్మిడికుంట, సున్నం చెరువు ఇలా నగరంలో ఏ చెరువును చూసినా దుర్గంధభరితంగా, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారాయన్నారు.
4.5 ఎకరాల చెరువు 17.5 ఎకరాలైంది ఎలా?
అలాంటి వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్నామని కమిషనర్ రంగనాధ్ వ్యాఖ్యానించారు. చెరువుల చుట్టూ పార్కులు, ప్లే ఏరియాలు, ఔషధ గుణాలున్న మొక్కలను నాటి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నామన్నారు. హైడ్రా అభివృద్ధి చేయకముందు చెరువులు ఎలా ఉండేవి, తర్వాత ఎలా మారాయనేది పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా వివరించారు. పాతబస్తీలోని బమృకున్ ఉద్ దౌలా చెరువు ఆక్రమణలకు గురై 4.5 ఎకరాలకు పరిమితం కాగా, ఇప్పుడా చెరువును 17.5 ఎకరాలకు విస్తరించామని వివరించారు. ఇలాగే మిగతా చెరువులలో ఆక్రమణలు తొలగించి విస్తరించినట్లు ఆయన తెలిపారు.
ప్రాక్టికల్‌గా చేసి చూపించిన హైడ్రా
ప్రకృతి పరిరక్షణ ఎలాగో చెరువుల పునరుద్ధరణతో పాటు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణతో హైడ్రా ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తోందని సదస్సుకు హాజరైన పద్మశ్రీ పురస్కార గ్రహీత, వ్యూహాత్మక సలహాదారు, ది హిమాలయ ఇనిషియేటివ్, అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్‌మెంట్ (ఏట్రీ) డైరెక్టర్ డా. ఎకలవ్య శర్మ సీఎస్ఐ ఆర్, ఐఐసీటీ డైరెక్టర్ డా. శ్రీనివాసరెడ్డి తో పాటు పలువురు వక్తలు ఈ సందర్భంగా కొనియాడారు. ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు, ఇలా ప్రతి చెరువుకు ఉండే సహజసిద్ధమైన లక్షణాలను కాపాడుతూ వాటిని పునరుద్ధరించడం ఆచరణీయంగా ఉందన్నారు. చెరువుల్లో నీళ్లు కలుషితం కాకుండా చూస్తే, జీవవైవిద్యానికి పెద్ద పీట వేసినట్టేనని పేర్కొన్నారు. కొన్నేళ్ల పాటు ఇదే నిబద్ధతతో పని చేస్తే హైదరాబాద్ నగరానికి ప్రకృతి పరంగా మంచి భవిష్యత్తు ఇచ్చినట్టవుతుందని వెల్లడించారు. వాతావరణంలో వచ్చిన పెనుమార్పులతో హిమాలయాల మంచు కరగడం, నేపాల్‌లో వరదలు, ఇలా ప్రకృతి వైపరీత్యాలకు గల కారణాలను డా. ఎకలవ్య శర్మ వివరించారు. సీఎస్ఐఆర్, నీరి(ఎన్ఈఈఆర్ఐ) నాగ్‌పూర్ డైరెక్టర్ డా. ఎస్ వెంకటమోహన్, నీరి హైదరాబాద్ శాస్త్రవేత్తలు డా. షేక్ బాషా, డా. టీవీబీపీఎస్ రామకృష్ణ తదితరులు ఈ సదస్సులో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలను చర్చించి, తీసుకోవల్సిన చర్యలను కూడా సిఫార్సు చేశారు.
Also Read: హైదరాబాద్‌లో పీఆర్టీ వ్యవస్థ.. భవిష్యత్ రవాణాకు సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!