తెలంగాణ రాజకీయాల్లో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత బిగ్ బాంబ్ పేల్చారు. వచ్చే 2029 ఎన్నికల్లో ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు స్పష్టంచేశారు. సోమవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. తెలంగాణకు తాను ఏం చేయదలచుకున్నానో స్పష్టంగా వివరించారు. ఎటువంటి తెలంగాణ తాను కావాలని కోరుకుంటున్నానో కూడా చెప్పారు.కవిత నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆమె.. ఫ్యామిలీలో ఆధిపత్య పోరు కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కవిత కొత్త పార్టీ పెడుతున్నారంటూ పలుమార్లు లీకులు వచ్చాయి. కానీ, సరైన సమయం కోసం చూస్తున్నానని.. ఆ టైం వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టి ప్రకటిస్తానని ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు.
కవిత ప్రకటనతో రానున్న రోజుల్లో అధికార పార్టీలో ఏమో గానీ.. ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో మాత్రం ముసలం పుట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కవితకు బీఆర్ఎస్ పార్టీ ఏవిధంగా ఫంక్షన్ అవుతుందో ఆమెకు ప్రతిదీ తెలుసు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీలో ఆమె భాగస్వామ్యులయ్యారు. అధికారానికి గులాబీ పార్టీ దూరమయ్యాక పదవులు, పంపకాల్లో తేడాలు రావడం వల్లే సొంత పార్టీకి వ్యతిరేకంగా ఆమె గళం వినిపించడం మొదలెట్టారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కానీ, అదంతా ఏమీ లేదని తన అనుకున్న వాళ్లే తనను మోసం చేశారని, ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని.. తన భర్త ఫోన్ కాల్స్ రికార్డు చేశారని..అది తాను తీసుకోలేకపోయానని, అయిన వాళ్లే తనను చీట్ చేశారని ఆరోపించారు.
2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని కవిత సోషల్ మీడియా ప్రకటనతో ఆమె త్వరలోనే పార్టీ కూడా పెట్టబోతున్నట్టు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. దీని బట్టి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆమె రెండుగా చీల్చుతారా? అన్న చర్చ కూడా మొదలైంది.టికెట్లు రాని వారికి, ఉద్యమకాలం నుంచి ఉండి పదవులు దక్కని వారికి కవిత అండగా నిలుస్తారని.. హరీశ్ రావు, తన అన్న కేటీఆర్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా రాజకీయపావులు కదుపుతారని కూడా టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ అంటే నచ్చని వాళ్లంతా కవితతో జతకడితే బీఆర్ఎస్‌కు అధికారం అందని ద్రాక్షే అవుతుందని ప్రచారం జరుగుతోంది.ఇక తనను ఎవరైతే పార్టీ నుంచి వెళ్లగొట్టారో వారికి కవిత తప్పకుండా గుణపాఠం చెబుతారా? అనే చర్చ కూడా మొదలైంది.
సోమవారం సాయంత్రం #AskKavitha హ్యాష్ ట్యాగ్స్‌తో కవిత ఎక్స్‌లోకి వచ్చారు. సుమారు గంట సేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్..‘మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారా?’ అని ప్రశ్నించాడు. ఇందుకు కవిత ‘ఎస్’ అని సమాధానం చెప్పారు. అంతేగాక.. ముఖ్యమంత్రి అయ్యాక తన పాలన ఏ లక్ష్యంతో సాగనుందనేది కూడా వివరించారు. ‘సామాజిక తెలంగాణ తన ధ్యేయమని, ముఖ్యంగా యువతకు, మహిళలకు వారికి నచ్చిన రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే విషయాలపై పనిచేస్తానని’ చెప్పుకొచ్చారు. మీరు తెలంగాణ సీఎం అయితే గత పాలకులు చేయనిది మీరు కొత్తగా ఏం చేయబోతున్నారని మరో నెటిజన్ అడగ్గా.. ‘ తెలంగాణలో ఉచిత విద్యను అందిస్తానని, తద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు విద్య మీద డబ్బులు చెల్లించాల్సి అవసరం ఉండదని.. విద్యకు మాత్రమే తెలంగాణ, దేశ భవిష్యత్‌ను మార్చే శక్తి ఉంది’ అని కవిత రిప్లయ్ ఇచ్చారు. మీరు పాలిటిక్స్ వదిలేసి ఏదైనా బిజినెస్ చేసుకోవాలని, కేసీఆర్ పేరు లేకుండా మీరు రాజకీయాలకు అన్ ఫిట్ అని మరో నెటిజన్ అనగా.. ‘సైలంట్‌గా ఉండండి.. సోషల్ మీడియాను విషపూరితంగా మార్చొద్దు.. ముందు మీ మైండ్ సెట్ క్లీన్ చేసుకోండి’ అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు.